విశాఖపట్నం విషయంలో ఆశనిరాశలు దాగుడుమూతలు ఆడుతూనే ఉన్నాయి. ఎందుకంటే అన్నీ ఉండి కూడా అద్రుష్టం ఆమడ దూరంలో ఉన్న నగరం ఇది. ఎంత ఆలస్యం అయితే అంత మంచిదే, విషం కూడా అమ్రుతం అవుతుంది. అది ఒక్క విశాఖ విషయంలోనే రుజువు కాబోతోంది.
ఇదిలా ఉండగా జగన్ 2019లో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచీ విశాఖలో జెండా వందనం కార్యక్రమం చేపడదామనుకుంటూనే ఉన్నారు. గత ఏడాది అగస్టులో విశాఖలోనే ఇండిపెండెన్స్ డే వేడుకలు అని ప్రచారం జరిగినా చివరికి విజయవాడలోనే జరిపారు.
ఇక ఈ ఏడాది జనవరి 26 రిపబ్లిక్ డే కూడా విశాఖలో జరపాలని అంతా సన్నధ్ధం అయ్యారు. చివరికి విజయవాడలోనే అది కూడా జరిగింది.
ఇపుడిక ఎటూ మూడు రాజధానులు చట్టబద్ధం అయ్యాయి కాబట్టి విశాఖలోనే ఆగస్ట్ 15 అని అంతా అనుకున్నారు. కానీ చివరి నిముషంలో మళ్ళీ చాన్స్ మిస్ అయింది. ఈసారికి విజయవాడలోనే స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతాయని భోగట్టా. మొత్తానికి విశాఖలో జెండాపండుగను చూడాలంటే మరో ఏడాది దాకా ఆగాలేమో. ఎందుకంటే అప్పటికి అంతా సద్దుమణుతుందని అంటున్నారు.