బరితెగిస్తే భరతం పడతారంతే… ?

గజం జాగా కనిపిస్తే చాలు గాంధారీ పుత్రులు అక్కడ చేరిపోతున్నారు. చాప చుట్టేసినట్లుగా చుట్టేస్తున్నారు. అంతే కాదు, తన పర తేడా లేకుండా ఎక్కడ లేని భూములనూ చెరపెట్టేస్తున్నారు. విశాఖ ఎదుగుతున్న నగరం. రోజు…

గజం జాగా కనిపిస్తే చాలు గాంధారీ పుత్రులు అక్కడ చేరిపోతున్నారు. చాప చుట్టేసినట్లుగా చుట్టేస్తున్నారు. అంతే కాదు, తన పర తేడా లేకుండా ఎక్కడ లేని భూములనూ చెరపెట్టేస్తున్నారు. విశాఖ ఎదుగుతున్న నగరం. రోజు రోజుకీ భూముల రేట్లు పెరిగిపోతున్నాయి. దాంతో పాటు డిమాండ్ వచ్చిపడుతోంది. దీంతో భూదందారాయుళ్ళు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ ప్రైవేట్ అన్న తేడా లేకుండా జెండా పాతేస్తున్నారు.

దీంతో ఆరోపణలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం కూడా సీరియస్ గానే రియాక్ట్ అవుతోంది. భూ కబ్జాదారుల ఆటకట్టించేందుకు విశాఖ జిల్లాలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ టాస్క్ ఫోర్స్ జిల్లా అంతటా కలియదిరిగి ఆక్రమణలకు గురి అయిన భూములను వెనక్కి తీసుకుంటుంది. అంతే కాదు, ఎవరి భూములు అయినా కబ్జాకు గురి అయితే ఆ ఫిర్యాదుల మేరకు రంగంలోకి దిగి బాధ్యులైన వారి మీద చర్యలు చేపడుతుంది.

ఇదిలా ఉండగా విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున అయితే జిల్లాలోని రెవిన్యూ అధికారులు, తహశీల్దార్లకు కచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు, భూ ఆక్రమణలపైన కఠిన చర్యలు తీసుకోవాలని, ఎక్కడా ఉపేక్షించవద్దని కూడా ఆయన హెచ్చరించారు.ఇక అధికారులు ఎవరైనా భూ ఆక్రమణలను చూసీ చూడనట్లుగా వదిలేస్తే వారి మీద కూడా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పడం విశేషం.

విశాఖ మెగా సిటీ, ఇక పాలనా రాజధానిని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పడంతో భూముల రేట్లు ఒక్కసారిగా నింగినంటాయి. ఇదే తడవుగా భూ బకాసురులు రెక్కలు విప్పుకుని మరీ బరితెగిస్తున్నారు. దీంతో వెల్లువెత్తుతున్న ఆరోపణలతో ప్రభుత్వం ఉక్కు పాదం మోపడానికే రెడీ అయింది. మరి ఇది ఫలించాలని అంతా కోరుకుంటున్నారు.