రోజుకొక కొత్త అంశంతో జగన్ ప్రభుత్వం వివాదాస్పద నిర్ణయాలకు తెరలేపుతోంది. ఇందులో భాగంగానే రియల్ ఎస్టేట్ వ్యాపారులు లేఔట్లలో 5 శాతం స్థలాన్ని జగనన్న కాలనీలకు ఇవ్వాలని జగన్ ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన పథకాన్ని చూడాలి. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి సలహాలు ఇచ్చే మహానుభావులు ఎవరో అని వైసీపీ శ్రేణులు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి.
ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు జగన్ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆయన తనయుడైన ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కి పోలికే లేదన్నారు. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా తండ్రీతనయుల మధ్య ఉందని తీవ్ర విమర్శలు చేశారు.
జగన్‌కు దిక్కుమాలిన సలహాలు ఎవరు ఇస్తున్నారో తమకు అర్ధం కావడంలేదని విష్ణుకుమార్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్న కాలనీలకు లేఅవుట్లలో 5శాతం స్థలాన్ని ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వాలని ఆయన నిలదీశారు.
ఇది పక్కా ప్రభుత్వ దోపిడీ అని ధ్వజమెత్తారు. ఈ పథకానికి జగనన్న రౌడీ మామూళ్లు అని పేరు పెట్టుకుంటే బాగుండేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గజం పది వేలు రూపాయలు ఉన్న చోట ఎకరం స్థలానికి 24 లక్షల రూపాయల భారం ఉంటుందన్నారు.
ప్రతి లేఅవుట్‌లో ఓపెన్ బార్, వైన్ షాపులు పెట్టుకోడానికి కూడా ప్రభుత్వం వెనకాడదని ఆయన తీవ్రంగా విమర్శించారు. జగన్ ప్రభుత్వంలోని కొన్ని నిర్ణయాలపై పార్టీలకు అతీతంగా జనంలో ఉన్న అభిప్రాయాలు… విష్ణుకుమార్ రాజు ఆరోపణల్లో ప్రతిబింబించాయి.
పేదలకు ఇంటి స్థలాల పేరుతో ప్రయివేట్ వ్యక్తుల స్థలాలను లాక్కోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.