కృష్ణాజలాల వివాదంపై బీజేపీ వైఖరేంటో విన్న తర్వాత…ఈ పార్టీనేనా 2024లో ఏపీలో అధికారంలోకి రావాలని కలలు కంటున్నది? అనే అనుమానం, ఆగ్రహం ఎవరికైనా కలగకమానవు. కృష్ణా జలాల విషయంలో ఏపీ హక్కుల్ని కాపాడుకు నేందుకు ఆ రాష్ట్ర బీజేపీ ఓ మంచి నిర్ణయం తీసుకుంటుందని అందరూ ఆశించారు. అలాంటి వాళ్లకు చివరికి నిరాశే మిగిలింది. బీజేపీపై కోపం రగిల్చింది.
‘రాయలసీమ నీటి ప్రాజెక్టులు, అభివృద్ధి’ అనే అంశంపై కర్నూలులో ఏపీ బీజేపీ సమావేశం నిర్వహించింది. అనంతరం సమావేశ వివరాలను బీజేపీ నేతలు మీడియాకు వివరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాత్రిళ్లు సెల్‌ఫోన్లలో మాట్లాడుకుంటూ.. పగలు ప్రధానికి లేఖలు రాస్తున్నారని విమర్శించారు.
హుజూరాబాద్ ఉపఎన్నికల్లో ఓటమి నుంచి గట్టెక్కడానికే కేసీఆర్ తెలంగాణవాదాన్ని తెరపైకి తెచ్చారన్నారు. ఏపీ ప్రభుత్వం దీటుగా సమాధానం చెప్పి, బోర్డుకు వాదనలు వినిపించాల్సిన సందర్భంలో ‘మేం మాట్లాడం’ అనే వైఖరిని డ్రామాగా భాజపా భావిస్తోందన్నారు. సమస్య వస్తే వెంటనే పరిష్కరించేలా చట్టాలున్నా ఎందుకు లేఖలు రాస్తున్నారని ఆయన ప్రశ్నించడం గమనార్హం.
జగన్ చెల్లెలు షర్మిల.. తెలంగాణ నుంచి చుక్కనీరు వదలనంటున్నారని, వీరు ముగ్గురూ (జగన్, కేసీఆర్, షర్మిల) కలిసి మూడు ముక్కలాట ఆడుతున్నారని విమర్శించారు. వీర్రాజు తన స్థాయికి తగ్గట్టు మాట్లాడలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం కేసీఆర్, జగన్‌లపై విమర్శల కోసమే విమర్శలు చేస్తున్నట్టుగా బీజేపీ నేతలు మాటలున్నాయన్నారు. తెలంగాణ మంత్రుల్లా అనవసరంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయమని, వినిపించాల్సిన చోటే తమ వాదనను బలంగా వినిపిస్తామని ఏపీ ప్రభుత్వం చెప్పిన వానికి బీజేపీ వక్రభాష్యం చెప్పడం విడ్డూరంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
తెలుగు రాష్ట్రాల సీఎంలు రాత్రిళ్లు సెల్‌ఫోన్లలో, పగలు రాసే లేఖలతో పనేంటని; ఇంతకూ తామేం చేస్తామో ప్రకటించి వుంటే ఏపీ ప్రజాదరణ పొంది వుండేవాళ్లనే అభిప్రాయాలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి. కేవలం ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను విమర్శించడానికి కర్నూలుకు వెళ్లాలా? అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి.
తెలంగాణలో సొంత కుంపటి పెట్టుకున్న షర్మిల… అన్నను కూడా కాదని తన రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగితే ఊరుకునేది లేదని హెచ్చరిం చారని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. ఇదే విధంగా తెలంగాణ బీజేపీ కూడా తమ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునేందుకు కేంద్రానికి లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఆ పని ఏపీ బీజేపీ చేయకపోగా, చిల్లరమల్లర విమర్శలతో పొద్దు గడుపుతోందనే ఆగ్రహం ప్రజల నుంచి వ్యక్తమవుతోంది.
చట్టాలుండగా, లేఖలు ఎందుకు రాస్తున్నారని ప్రశ్నిస్తున్న సోము వీర్రాజు …అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలు గొడవ పడుతుంటే తమాషా చూస్తుందని చెప్పదలుచుకున్నారా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇంత బాధ్యతా రహితమైన కేంద్ర ప్రభుత్వాన్ని ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదని, భవిష్యత్‌లో కూడా చూడబోమనే అభిప్రాయాలు వ్యక్తం కావడం విశేషం. ఏపీలో ఇలాంటి బాధ్యతలేని నాయకుల వల్ల బీజేపీ అధికారంలోకి ఎప్పటికీ రాలేదనే కామెంట్స్ కూడా వెల్లువెత్తుతున్నాయి.