జనసేనాని పవన్‌కల్యాణ్‌కు రాజధాని అమరావతికి దారేది? అడ్జెంట్‌గా ఆయనకు అమరావతిపై ఉద్యమించడానికి ఓ దారి కావాలి. అది ఎలా వస్తుందనేదే ప్రధాన ప్రశ్న. రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిదని, అందులో తాము జోక్యం చేసుకోలేమని, అయితే అమరావతిలోనే రాజధాని ఉండాలనేది ఏపీ బీజేపీ రాష్ట్ర శాఖ డిమాండ్ అని ఆ పార్టీ అధిష్టానం తేల్చి చెప్పింది. మరోవైపు బీజేపీ మిత్రపక్షంగా పవన్‌కల్యాణ్ కూడా అదే మాట మాట్లాడక తప్పని పరిస్థితి.
రాజధాని బిల్లులకు గవర్నర్ ఆమోద ముద్ర వేయగానే పవన్‌కల్యాణ్ విడుదల చేసిన ప్రకటన…టీడీపీ అధినేత చంద్రబాబును తప్పు పట్టేలా ఉంది. గతంలో చంద్రబాబు చేసిన పని వల్లే…నేడు రాజధాని రైతులకు ఈ కష్టాలు వచ్చాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విజయవాడలో శనివారం అమరావతి జేఏసీ మహిళా కన్వీనర్లు అక్కినేని వనజ, సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ ప్రజల్ని వైసీపీ, బీజేపీ, జనసేనలు వెన్నుపోటు పొడిచాయని మండిపడ్డారు.
వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ బీజేపీ, జనసేలను కూడా అదే విధంగా ట్రీట్ చేయడం కొత్త పరిణామం. ఎట్టి పరిస్థితుల్లో అమరావతి నుంచి రాజధానిని తరలించనివ్వనని గతంలో పవన్‌కల్యాణ్ ప్రతిజ్ఞ చేశారు. బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న తర్వాత రాజధాని విషయంలో ఆయన వైఖరి మారింది. అందువల్లే జనసేనాని కూడా అమరావతి రైతులు తిట్టిపోస్తున్నారు.
ఈ నేపథ్యంలో మూడు రాజధానుల అంశంపై చర్చించేందుకు జనసేన కీలక సమావేశం ఆదివారం నిర్వహించనుంది. రాజకీయ వ్యవహార కమిటీ (పీఏసీ) ప్రతినిధులతో జనసేనాని మూడు రాజధానుల నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై టెలీకాన్ఫరెన్స్‌లో నేతల అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. అయితే బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న సందర్భంలో రెండు పార్టీల మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి.
రాష్ట్ర, దేశాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మోడీ నాయకత్వంలో పని చేసేందుకు భేషరతుగా పవన్ అంగీకరించారని నాటీ బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించారు. ప్రజా సమస్యలపై ఇకపై ఉమ్మడిగా కలిసి పోరాడతామని.. ఏపీలో అధికా రమే లక్ష్యంగా పని చేస్తామని స్పష్టం చేశారు. ఇటీవల బీజేపీ ఏపీ నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ 2024లో బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థే సీఎం అవుతారని ప్రకటించారు.
మరి ఇప్పుడు బీజేపీతో సంబంధం లేకుండా మూడు రాజధానుల అంశంపై ఏ విధంగా ముందుకు పోతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు అమరావతి రాజధానిపై మనస్ఫూర్తిగా పోరాటం చేసేందుకు పవన్ సిద్ధంగా లేరు. ఈ విషయాన్ని అమరావతి రైతులు గ్రహించడం వల్లే బీజేపీతో పాటు జనసేనానిపై కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. తన పార్టీ ప్రతినిధుల నుంచి కేవలం అభిప్రాయాల సేకరణ వరకే పరిమితం అవుతారా? లేక కార్యాచరణకు శ్రీకారం చుడతారా? అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ బీజేపీని కాదని ప్రత్యక్ష కార్యాచరణకు దిగితే మాత్రం…ఇక శాశ్వతంగా ఆ పార్టీతో తెగదెంపులు చేసుకున్నట్టే. బీజేపీతో పొత్తు విచ్ఛిన్నం చేసుకునేంత అజ్ఞాని పవన్ ఎంత మాత్రం కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.