పౌర‌స‌త్వ చ‌ట్టంపై ప‌వ‌న్ అభిప్రాయం ఏంటి?

ల‌క్ష‌లాది పుస్త‌కాలు, కోట్లాది మంది ప్ర‌జ‌ల మ‌న‌సుల‌ను చ‌దివిన అప‌ర‌మేధావి, జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు ఓ ప్ర‌శ్న‌. ఇటీవ‌ల కేంద్ర‌స‌ర్కార్ తీసుకొచ్చిన పౌరసత్వ చట్ట సవరణ బిల్లు(క్యాబ్‌)పై ప‌వ‌న్ అభిప్రాయం ఏంటి? ఇంత వ‌ర‌కూ ఆ…

ల‌క్ష‌లాది పుస్త‌కాలు, కోట్లాది మంది ప్ర‌జ‌ల మ‌న‌సుల‌ను చ‌దివిన అప‌ర‌మేధావి, జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు ఓ ప్ర‌శ్న‌. ఇటీవ‌ల కేంద్ర‌స‌ర్కార్ తీసుకొచ్చిన పౌరసత్వ చట్ట సవరణ బిల్లు(క్యాబ్‌)పై ప‌వ‌న్ అభిప్రాయం ఏంటి? ఇంత వ‌ర‌కూ ఆ బిల్లుపై జ‌న‌సేన పార్టీ ఎక్క‌డా త‌న అభిప్రాయాన్ని చెప్ప‌లేదు.

జ‌న‌సేన పార్టీకి అసెంబ్లీలో ఒకే ఒక్క‌రు ప్రాతినిథ్యం వ‌హిస్తుండ‌గా, పార్ల‌మెంట్లో ఏ ఒక్క‌రూ లేరు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల అనంత‌రం ప‌వ‌న్‌క‌ల్యాణ్ భ‌వ‌న నిర్మాణ కార్మికుల స‌మస్య‌ల‌పై విశాఖలో లాంగ్‌మార్చ్ చేశారు. ఆ త‌ర్వాత ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ఆంగ్ల మాధ్య‌మాన్ని ప్ర‌వేశ పెట్టాల‌ని జ‌గ‌న్ స‌ర్కార్ తీసుకున్న నిర్ణ‌యంపై ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

సోష‌ల్ మీడియా వేదిక‌గా మాతృభాష తెలుగుపై మ‌మ‌కారాన్ని వ్య‌క్త‌ప‌ర‌చ‌డంతో పాటు దాన్ని చంపేయాల‌నుకుంటున్న జ‌గ‌న్ స‌ర్కార్ మ‌ట్టి కొట్టుకుపోతుంద‌ని శాప‌నార్థాలు పెట్టారు.అలాగే రైతు స‌మ‌స్య‌ల‌పై రైతుసౌభాగ్య పేరుతో ఒక్క‌రోజు దీక్ష‌కు కూర్చున్నారు.

ఈ నేప‌థ్యంలో మోడీ స‌ర్కార్ పౌర‌స‌త్వ చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లుకు లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ‌ల్లో ఆమోద ముద్ర వేసుకొంది. ఈ నేప‌థ్యంలో ముస్లింలు పెద్ద ఎత్తున ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. చెగువేరా ముద్దు బిడ్డ‌గా త‌న‌ను తాను ప్ర‌క‌టించుకున్న ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎలా స్పందిస్తారోన‌ని ప్ర‌జాసంఘాలు, వామ‌ప‌క్షాలు, ఇత‌ర ప్ర‌తిప‌క్ష పార్టీలు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాయి.

అయితే మ‌న రాష్ర్టంలోని పాల‌క‌, ప్ర‌తిప‌క్ష పార్టీలు ఉభ‌య‌స‌భ‌ల్లో మోడీ స‌ర్కార్‌కు అండ‌గా నిలిచాయి. టీఆర్ఎస్ మాత్రం మోడీకి వ్య‌తిరేకంగా ఓటు వేసింది.ఓట్లు, సీట్లతో సంబంధం లేకుండా స‌మ‌స్య‌ల ప్రాతిప‌దిక‌న స్పందిస్తానంటున్న అప‌ర‌మేధావి ప‌వ‌న్ ఎటువైపు అనేది తెలుసుకోవాల‌ని పౌర‌స‌మాజం ఆస‌క్తిగా ఎదురు చూస్తోంది. మోడీ స‌ర్కార్‌కు వ్య‌తిరేకంగా నోరు తెరిచే ద‌మ్ము ప‌వ‌న్‌కు ఉందా?