స్పందించే హక్కు, వాక్ స్వతంత్రం, భావ ప్రకటనా స్వేచ్ఛ.. భూమిపై మనిషి పుట్టుకతోనే అతడికి సొంతమైన భావాలివి. సృష్టిలో స్పష్టమైన భావ ప్రకటన చేయగల అరుదైన జీవుల్లో మనిషి ముఖ్యమైనవాడు. అదే అతడిని మిగతా జంతుజాలం నుంచి వేరు చేసింది, శక్తిమంతుడిగా తీర్చిదిద్దింది.
భావ ప్రకటన మనిషి ఆలోచనకు రూపం. ఆ ఆలోచనే అతడి జీవితాన్ని సులభతరంగా, సుఖవంతంగా చేసింది. మనిషి భావ ప్రకటన తీరు వల్లనే అతడికో సమాజం ఏర్పడింది. అలా ఏర్పడిన సమాజం అతడి భావ ప్రకటన స్వేచ్ఛకే బోలెడన్ని పరిమితులను సృష్టించింది.
ఆ పరిమితులు కూడా సంఘజీవనంలో తప్పవు కానీ.. సమాజం కాస్తా రాజ్యంగా మారాకా, సాటి మనుషులు ఏలేందుకు రాజులు వచ్చాకా.. మాత్రం భావ ప్రకటన కష్టంగా మారింది! దానికి స్వేచ్ఛ అవసరమైంది! అది అరుదుగా మాత్రమే లభించేదిగా మారింది!
ప్రస్తుతం ఏడువందల కోట్ల మంది ప్రజలు ఈ భూమిపై ఉన్నారనుకుంటే.. వారిలో భావ ప్రకటన స్వేచ్ఛను కలిగింది చాలా తక్కువమందే అంటే ఆశ్చర్యం కలగకమానదు! చాలా దేశాల్లో.. ప్రభుత్వాధి నేతలు, రాజులు.. తమ పౌరులకు స్వేచ్ఛగా మాట్లాడే హక్కును ఇవ్వ లేదు.
ప్రజలు ప్రభుత్వానికి నొప్పించేలా మాట్లాడే హక్కు లేదక్కడ. మరి కొన్ని చోట్ల మతమే నియంత. మతాచారాల పరిమితులకు లోబడే అక్కడ పౌరులు స్పందించాలి. ఇంకొన్ని చోట్ల అభివృద్ధే ముఖ్యం మనిషికి స్వేచ్ఛ అవసరం లేదు.. అంటూ ఇనుప చెరల్లోని పాలన సాగుతూ ఉంది. ఇలా పరిస్థితుల్లో కొన్ని వందల కోట్ల మంది ప్రజలు తమ భావ ప్రకటనా స్వేచ్ఛ లేకుండానే జీవిస్తున్నారు.
అయితే ఇదే ప్రపంచంలో కొన్ని ప్రజాస్వామ్య దేశాలు తమ ప్రజలకు భావ ప్రకటన స్వేచ్ఛను హక్కుగా ఇచ్చాయి. వీటి సంఖ్య తక్కువే! అమెరికా, ఇండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి కొన్ని నమ్మకమైన ప్రజాస్వామ్య దేశాలు.. యూరోపియన్ దేశాలు.. ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ప్రజలకు స్పందించే హక్కును ఇచ్చాయి. అయితే ఇలాంటి దేశాల్లో ఈ అంశాలపై వివాదాలు రాకమానడం లేదు!
విదేశాల సంగతి ఎలా ఉన్నా.. ఇండియాలో ఈ భావ ప్రకటన స్వేచ్ఛకు రకరకాల స్పందనలు వస్తున్నాయి. ఒక్కోసారి మన వ్యవస్థ ఒక్కోలా స్పందిస్తుంది. సోషల్ మీడియాలో ఎవరైనా ఏ అంశం మీదైనా తమ ఆలోచనలను పంచుకుంటే, అవి ఎవరికైనా అభ్యంతరం అయితే.. వ్యవస్థ స్పందించే తీరు ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది!
ఈ మధ్యనే సోషల్ మీడియా పోస్టింగుల విషయంలో కొన్ని వ్యవహారాలు కోర్టుల వరకూ ఎక్కాయి. ఒక్కోసారి కోర్టులు సోషల్ మీడియాలో అయినా మనుషులకు స్పందించే స్వేచ్ఛను ఇవ్వండని ప్రభుత్వాలకు తలంటాయి. మరీ ఇనుప చెరలతో పాలించాలంటే కుదరదు అని కోర్టులు స్పష్టం చేశాయి. మరి కొన్ని ఉందంతాల్లో సోషల్ మీడియా పోస్టింగులను న్యాయస్థానాలే తప్పు పట్టాయి.
పాలకులు సహనంతో ఉండాలని, అసహనం కూడదని చెప్పిన న్యాయస్థానాలు, మరి కొన్ని సార్లు తీవ్రంగా స్పందించాయి! ఆ సందర్భాలకు పెద్ద తేడా లేకున్నా, ఈ వ్యవస్థ స్పందించే తీరులోనే తేడాలు కనిపిస్తున్నాయి!
ఇంతకీ ఏది రైటు? ఏది తప్పు? అనేది ఇప్పుడు సామాన్యుడికి అంతుబట్టనిదిగా మారుతోంది. మనిషికి ప్రజాస్వామ్యం ఇచ్చిన భావప్రకటన స్వేచ్ఛకు తాము కాపలాదారులమని కోర్టులు ఒక్కోసారి చెబుతున్నాయి. మరి కొన్ని సార్లు చిన్నపాటి స్పందనలకే తీవ్ర ప్రతిస్పందనలు ఎదురవుతున్నాయి. ఇలా గందరగోళ పరిస్థితి ఏర్పడుతోంది. ఇంతకీ దేనికి స్పందించవచ్చో, దానికి స్పందించరాదో.. ఎప్పుడు ఆ హక్కు ఉంటుందో, ఎప్పుడు ఆ హక్కు ఉండదో..!