పార్టీ ఫిరాయింపులపై అసెంబ్లీలో చర్చ. ఇది ఊహించుకుంటేనే చంద్రబాబు గుండె గుభేలుమంటుంది. 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొని వారిలో కొందరికి మంత్రి పదవుల్ని సైతం కట్టబెట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ఘనత చంద్రబాబుది. అన్ని రాష్ట్రాల్లో, ఆఖరుకి కేంద్రంలో కూడా జరిగే తంతు ఇదే అయినా ఏపీలో జరిగినంత దారుణంగా దేశంలో ఎక్కడా జరగలేదు.
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కొందర్ని, రాజ్యసభ ఎన్నికల కోసం మరికొందర్ని, ప్రతిపక్షంపై కక్ష తీర్చుకోడానికి ఇంకొందర్ని.. ఇలా చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యేలతో వ్యాపారం చేశారు. ఈ ఎపిసోడ్ అంతా మరోసారి కళ్లముందు మెదిలితే, అసలు చంద్రబాబు దుర్మార్గం ఏ స్థాయిలో ఉందో అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు తెలుస్తుంది. ఎక్కడెక్కడ ఎవరెవర్ని ఎంతెంత రేటుకి కొన్నదీ, అమ్ముడుపోయిన తర్వాత వారు ప్రభుత్వ ఎమ్మెల్యేలుగా ఎంతెంత సంపాదించిందీ, ఎన్నెన్ని అరాచకాలు చేసిందీ అన్నీ లెక్క తేలుతాయి.
ఇప్పటివరకూ ఇలాంటి చర్చ ఏ అసెంబ్లీలోనూ జరగలేదు. అయితే ఏపీ అసెంబ్లీలో పదే పదే సభని తప్పుదోవ పట్టిస్తున్న ప్రతిపక్షానికి ఓ హెచ్చరికలా ఈ పాయింట్ తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో సీఎం జగన్ తర్వాత అత్యంత భారీ మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యే అన్నే రాంబాబు ఈ ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులపై చర్చ జరగాల్సిందేనంటూ పట్టుబట్టారు. సభా సంప్రదాయాలు, విలువల గురించి చంద్రబాబు మాట్లాడటంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. సభ గౌరవం పెరగాలంటే, ఫిరాయింపులపై చర్చ జరగాల్సిందేనని, విలువల గురించి మాట్లాడుతున్న చంద్రబాబు విలువ ఏంటో తెలియాల్సిందేనని డిమాండ్ చేశారు.
మంత్రి అనిల్ ఈ ప్రతిపాదన సమర్థిస్తూ చర్చ జరిగితే ఎవరేంటో ప్రజలందరికీ తెలుస్తుందని సభాపతిని కోరారు. స్పందించిన స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా చర్చ జరిగితే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. ప్రస్తుతం ప్రతి రాష్ట్రంలో కూడా ఫిరాయింపులు జరుగుతున్నాయని, ఇలాంటి విషయంపై అసెంబ్లీలో చర్చ జరిపిన తొలి రాష్ట్రంగా ఏపీ నిలిచిపోతుందని, ఓ తీర్మానం చేసి దేశానికి మంచి సందేశాన్ని పంపుతామని అన్నారు స్పీకర్.
అయితే ఈ పాయింట్ తెరపైకి వచ్చీ రావడంతోనే చంద్రబాబుకి ముచ్చెమటలు పోశాయి. టీడీపీ ఎమ్మెల్యేలు సభలో గందరగోళం సృష్టించాలని చూశారు. శని, ఆది సెలవుల తర్వాత సోమవారం.. సభలో పార్టీ ఫిరాయింపుల చర్చ జరిగితే మాత్రం టీడీపీ పారిపోవడం ఖాయం. చంద్రబాబుకు పట్టపగలు చుక్కలు కనిపించడం గ్యారెంటీ.