ఆనందయ్య స్థానంలో పతంజలి ఉంటేనా…!

ఆనందయ్య ఆయుర్వేదం మందుపై ఎంత రచ్చ జరుగుతుందో అందరికీ తెలిసిందే. ఆయనేదో తన మానాన తాను ఉచితంగా మందు పంపిణీ చేస్తున్న కాలంలో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఆనోటా ఈనోటా పాజిటివ్ టాక్ విస్తరించడం,…

ఆనందయ్య ఆయుర్వేదం మందుపై ఎంత రచ్చ జరుగుతుందో అందరికీ తెలిసిందే. ఆయనేదో తన మానాన తాను ఉచితంగా మందు పంపిణీ చేస్తున్న కాలంలో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఆనోటా ఈనోటా పాజిటివ్ టాక్ విస్తరించడం, సోషల్ మీడియా ఆనందయ్యను అభినవ బోధిదర్మగా ప్రకటించేయడంతో ఒక్కసారిగా వేలమంది కృష్ణపట్నంపై పడిపోయారు. అయితే ఆనందయ్యలో ఎక్కడో కమర్షియల్ ఎలిమెంట్ మిస్ అయింది. అందుకే ఆ మందు వెనకబడింది.

ఆనందయ్య తానిచ్చే మందు ఆయుర్వేదం అంటున్నాడు, ఆయుష్ వాళ్లు నాటుమందు అని తేల్చేశారు. జనం మాత్రం దాన్ని సంజీవి అంటున్నారు. అదే పతంజలి కంపెనీ నుంచి ఆ ప్రోడక్ట్ రిలీజ్ అయి ఉంటే, ఆనందయ్య స్థానంలో రామ్ దేవ్ బాబా ఉండి ఉంటే.. ఈపాటికి జాతీయ స్థాయిలో ప్యాకెట్ల పంపిణీకి రంగం సిద్ధమయ్యేది. విదేశాలకు కూడా మోదీ దీన్ని సరఫరా చేసి దానకర్ణుడిగా ఫోజు కొట్టేవారు.

కరోనిల్ అంటూ కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో పతంజలి వారు చేసిన హడావిడి అందరం చూశాం కదా. కనీస అనుమతులు కూడా లేకుండా.. పతంజలి సంస్థ కరోనిల్ ని మార్కెట్లోకి తేవడం, దానికి ప్రభుత్వ పెద్దల సహకారం ఉండటం అందరికీ తెలిసిందే. 

చివరకు కొంతమంది మేథావులు అభ్యంతరం తెలపడంతో కరోనిల్ పై వెనక్కి తగ్గింది పతంజలి. వ్యవహారం కోర్టు కేసుల వరకూ వెళ్లడంతో కరోనిల్ వ్యాపారానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. అయితే దాన్ని కరోనా మందుగా కాకుండా.. వ్యాధి నిరోధక శక్తి పెంచే దివ్య ఔషధంగా ప్రచారం చేసి మార్కెట్లోకి తెచ్చారు పతంజలి నిర్వాహకులు. రెండోసారి జనాలకు టోపీ పెట్టేశారు.

పోనీ ఆనందయ్య మందుని కూడా రోగనిరోధక శక్తిని పెంచే ఆయుర్వేద/నాటు మందుగా వాడొచ్చు కదా. కరోనా బాధితులతో పాటు, కరోనా రాకుండా ఉండేందుకు కూడా సామాన్య ప్రజలు దీన్ని పుచ్చుకుంటున్నారు కదా. కరోనా కష్టకాలంలో వ్యాధి నిరోధక శక్తి పెంచే విటమిన్ ట్యాబ్లెట్లు అంటూ.. పేరుగొప్ప కంపెనీలు టీవీల్లో ఊదరగొడుతున్నాయి. వాటితో పాటు ఇది కూడా. ఎవరి ''ఆనందా''నికి వాళ్లు వాడుకుంటారు.

కరోనా రాకుండా ఒంటికి పేడ పూసుకొని, గోమూత్రంతో స్నానం చేసే ప్రక్రియ కంటే ఆనందయ్య మందు చాలా బెటర్ అంటూ సోషల్ మీడియాలో చాలామంది పోస్టులు పెడుతున్నారు. ప్రజల నమ్మకాల్ని కాదనే హక్కు ఎవ్వరికీ లేదని.. ఎవరి నమ్మకానికి తగ్గట్టు వాళ్లు మందు వాడుకుంటారని చెబుతున్నారు.

ఏదేమైనా దేనికైనా బ్రాండింగ్ ఉండాలనే విషయం ఆనందయ్య ఎపిసోడ్ తో తేలిపోయింది. ఇదే టైమ్ లో ఆనందయ్య సీన్ లో పతంజలి ఉండి ఉంటేనా.. ఆ బ్రాండింగ్ ముచ్చట్లు, లైవ్ డిమానిస్ట్రేషన్లు, కాషాయ కబుర్లు చెవులారా వినేవాళ్లం. కళ్లారా చూసి తరించేవాళ్లం. ఈ విషయంలో ఆనందయ్య ఎందుకూ పనికిరాడు. కాదంటారా!