చప్పట్లు కొట్టడం, దీపాలు పెట్టడం సంగతెలా ఉన్నా.. ఇంతకీ ఏప్రిల్ 14 తర్వాత ఏమిటి? అనే విషయం గురించి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు సమాలోచనలు చేయాల్సిన అవసరం ఉంది. లాక్ డౌన్ ను కొనసాగించడమా, లేక మరో ప్రత్యామ్నాయ మార్గాన్ని కనుగొనడమా? అనే అంశం గురించి ఇప్పటి నుంచినే ప్రభుత్వాలు కసరత్తు ప్రారంభించాల్సిన అవసరం చాలానే కనిపిస్తూ ఉంది. ఏప్రిల్ 14వ తేదీతో ముందుగా ప్రకటించుకున్న లాక్ డౌన్ సమయం ముగుస్తుంది. అయితే పేరుకు ఇది లాక్ డౌనే, తిరిగే వాళ్లు తిరుగుతున్నారు. ఎటొచ్చీ చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్లే చితికిపోతున్నారు.
లాక్ డౌన్ సమయంలో.. అలర్ట్ గా ఉండాల్సిన సమయంలోనే.. కరోనాను అంటించే వారు అంటించారు. ఏమాత్రం బాధ్యత లేకుండా రోడ్ల మీదకు వచ్చే వాళ్లు వస్తున్నారు. ఇంతకీ లాక్ డౌన్ ఎవరికయ్యా? అంటే.. పనులు చేసుకునే వాళ్లకు. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఎంతో కొంత ఆనందం ఏమిటంటే.. లాక్ డౌన్ తో దేశంలో కరోనా వ్యాప్తి చాలా వరకూ తగ్గిందనే అభిప్రాయాలు. ఒకవేళ లాక్ డౌనే ప్రకటించకుంటే పరిస్థితి మరోలా ఉండేదని స్పష్టం అవుతూ ఉంది.
ఇక ఎటొచ్చీ ఏప్రిల్ 14 తర్వాత ఏమిటనేది.. ఇప్పటి వరకూ స్పష్టత లేని అంశం. లాక్ డౌన్ ను వారం రోజుల పాటు పొడిగివ్వాలి, కాదు మే నెలారంభం వరకూ.. అదీ కాదు సెప్టెంబర్ వరకూ.. అంటూ సోషల్ మీడియా మేధావులు ఎవరికి తోచింది వారు చెబుతున్నారు. మనది కాకపోతే కాశీ వరకూ దేకమనొచ్చు. దాంట్లో ఏముంది. అయితే చిన్నచితాక పనులు చేసుకునే వారి విషయంలో ఇలాంటి పరిస్థితే కొనసాగితే, వారి జీవితాలు ఏమైపోవాలి?
ఒకవైపు కరోనాను నియంత్రించాలి, మరోవైపు ఇలాగే లాక్ డౌన్ అంటే భారత ప్రభుత్వం కూడా ఆర్థికంగా బాగా దెబ్బతింటుంది. ఇప్పటికే రాష్ట్రాలు అప్పుల తెచ్చుకోవడం మీద పరిమితిని ఎత్తేయండంటూ కేంద్రానికి విన్నవించుకుంటున్నాయి. ఆదాయం లేకుండా నెలల తరబడి అప్పులు అంటే.. ప్రభుత్వాలకూ కుదిరేపని కాదు. ఇలాంటి నేపథ్యంలో.. కరోనా ప్రభావిత ప్రాంతాలను పక్కగా గుర్తించి చర్యలు చేపట్టడమా, ముందుగా కరోనా ప్రభావం లేని చిన్నచిన్న పట్టణ ప్రాంతాలకు లాక్ డౌన్ నుంచి మినహాయింపును ఇవ్వడమా.. ఈ విషయం గురించి కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు కూలంకషంగా చర్చించి, ఏప్రిల్ 14 తర్వాత ఏమిటనే విషయం గురించి ప్రజలకు కాస్త ముందే స్పష్టతను ఇవ్వడం మేలేమో!