నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలను అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష టీడీపీకి చెందిన రాష్ట్ర నాయకులు తిష్టవేసి సత్తా చాటాలని సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఈ క్రమంలో వైసీపీ 8 డివిజన్లను ఏకగ్రీవం చేసుకుని టీడీపీని కోలుకోలేని దెబ్బతీసింది.
శ్రీకాకుళం నుంచి నెల్లూరుకు వచ్చి టీడీపీని గెలిపించుకోవాలని శ్రమిస్తున్నా… నెల్లూరు నగరానికి చెందిన టీడీపీ ముఖ్యనాయకుడు, మాజీ మంత్రి నారాయణ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ఆయన మాట వినిపించడం లేదు.
టీడీపీ హయాంలో నెల్లూరుకు చెందిన నారాయణ విద్యాసంస్థల అధిపతి పొంగూరు నారాయణ మున్సిపల్‌శాఖ మంత్రిగా క్రియాశీలక పాత్ర పోషించారు. రాజధాని ఎంపిక కమిటీకి ఆయనే నేతృత్వం వహించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు నగర అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ తరపున ఆయన పోటీ చేశారు. ప్రస్తుత మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ చేతిలో ఆయన స్వల్ప మెజార్టీ (2 వేలకు లోపు)తో ఓటమి పాలయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లో అధికార మార్పిడి జరగడంతో నారాయణ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తన వ్యాపార లావాదేవీలపై రాజకీయాలు తీవ్ర ప్రభావం చూపుతాయనే భయంతో ఆయన తెరచాటుకు వెళ్లారు.
అసలు ఆయన రాజకీయాల్లో ఉన్నారో, లేదో కూడా ఆయన పార్టీకే తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికలొచ్చాయి. నారాయణ సైలెంట్ కావడంతో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, బీద రవిచంద్ర తదితరులు నెల్లూరు నగర బాధ్యతల్ని చూస్తున్నారు.