మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రోజురోజుకూ ప్రజాదరణ కోల్పోతున్నారనేది వాస్తవం. అయితే ఆ విషయాన్ని ఆయన గ్రహిస్తున్నట్టు లేరు. పైగా వయసు, రాజకీయ అనుభవం పెరిగే కొద్ది మరింత హూందాగా వ్యవహరించాల్సిన పెద్ద మనిషి, మరీ దిగజారి మాట్లాడుతుండడం వినేవాళ్లకే ఎబ్బెట్టుగా ఉంటోందనే చర్చ జరుగుతోంది.
తాజాగా పంచాయతీ ఎన్నికల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వానికి , ఎస్ఈసీకి మధ్య వార్ నడుస్తోంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ప్రభుత్వ అభిప్రాయంతో ఏ మాత్రం సంబంధం లేకుండా ఏకంగా షెడ్యూల్‌నే ప్రకటించి వివాదానికి తెర తీశారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు.
ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలను స్వాగతిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని నియంత్రిం చేందుకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఎవరని ఆయన ప్రశ్నించారు. అంతేకాదు, పంచాయతీ ఎన్నికల నిర్వహణకు, సీఎం జగన్‌కు సంబంధం ఏంటని ఆయన నిలదీశారు.
ఈ మాటలను చంద్రబాబు కాకుండా మరే నాయకుడైనా మాట్లాడి ఉంటే ఆమోదయోగ్యంగా ఉండేవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు స్థానిక సంస్థలకు చంద్రబాబు హయాంలోనే ఎన్నికలు పూర్తి అయి ఉండాలి. 2018లో స్థానిక సంస్థల పదవీ కాలం పూర్తయింది.
అప్పట్లో ఎన్నికలు నిర్వహిస్తే ప్రజావ్యతిరేకత సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందే బయటపడి, అసలుకే ఎసరు వస్తుందని చంద్రబాబు భయపడ్డారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల ఊసే ఎత్తలేదు. ఇప్పుడు రాజ్యాంగం , స్థానిక సంస్థల ఎన్నికల ఆవశ్యకత గురంచి ధర్మోపన్యాసాలు చెబుతున్న పెద్ద మనిషే, అప్పుడు కూడా ఆ పదవిలో ఉన్నారు. అప్పుడేవీ ఆయనకు గుర్తు లేవు.
చంద్రబాబు చెప్పిందే రాజ్యాంగం, ఆయన శాసనమే వేదవాక్కుగా రాజ్యాంగ పదవిలో సేదతీరుతూ వచ్చారు. ఇప్పుడు బాబు పోయి జగన్ రాగానే అన్నీ గుర్తుకొస్తున్నాయి. తన హయాంలో జరగాల్సిన ఎన్నికలను ఏ అధికారంతో నిలుపుదల చేశారో చంద్రబాబు జవాబు చెప్పాలని ప్రత్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. అప్పుడేమీ కరోనా లాంటి విపత్కర పరిస్థితులు కూడా ఏమీ లేవని గుర్తు చేస్తున్నారు.
తనకు మాత్రమే ఎన్నికల సంఘాన్ని నియంత్రించే ప్రత్యేక హక్కు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారో బాబు సమాధానం చెప్పాలి. రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని నియంత్రించేందుకు సీఎం జగన్ ఎవరని ప్రశ్నిస్తున్న చంద్రబాబు… అదే ప్రశ్న తనకు కూడా వర్తిస్తుం దని గుర్తెరగాలి. ఎందుకంటే ఎదుటి వాళ్ల వైపు ఒక వేలు చూపితే, మిగిలిన నాలుగు వేళ్లు తనవైపే చూపుతాయని చంద్రబాబుకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.