అసలే బీజేపీ పరిస్థితి అంతంత మాత్రం. ఆశ లావు, పీక సన్నం వాటం. ఏపీలో ఎలాగైనా ఎదగాలని బీజేపీ చూస్తోంది కానీ ఆ సమయానికే ఎన్నో అవరోధాలు అలా ఎదురవుతున్నాయి.
ఇదిలా ఉంటే విశాఖలో కాస్తో కూస్తో బలం ఉందనుకుంటూ జీవీఎంసీ ఎన్నికల మీద బీజేపీ ఫోకస్ పెట్టింది. సరిగ్గా ఇదే సమయంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణను చేసేందుకు రెడీ అయిపోతోంది. దాంతో పాటే విశాఖలో బీజేపీ ఆశలను కూడా పట్టుకుపోతోంది.
ఇక ఉన్నట్లుండి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు బీజేపీ మీద పడ్డారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగదు అంటూ ఏపీ బీజేపీ పెద్దలు చెప్పారుగా. ఇపుడేమంటారు అంటూ గంటా బాగానే గద్దిస్తున్నాడు. ప్రధాని మోడీ సంకేతాలు ఇచ్చేశాక ఇక ఉక్కు బతికి బట్టకడుతుందా అంటూ కమలనాధులను గట్టిగా నిలదీస్తున్నాడు.
బీజేపీ మీద దండయాత్రకు అంతా కలసి ముందుకు సాగాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి విశాఖలో కొన్ని కార్పోరేట్ సీట్లు అయినా గెలుచుకోవాలని బీజేపీ పడుతున్న ఆరాటానికి మాజీ మంత్రి అలా గండి కొట్టేస్తున్నారు అన్న మాట.