వైఎస్ వివేకా హత్యకు సంబంధించి నిందితుడు దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం తీవ్ర చర్చకు దారి తీసింది. ఇందులో ప్రధానంగా కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డి, చిన్నాన్న వైఎస్ మనోహర్‌రెడ్డి, డి.శంకర్‌రెడ్డి పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. వివేకా హత్య కేసులో కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందనే ప్రచారం…. పరోక్షంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఇబ్బందికరమే.
ఈ నేపథ్యంలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యతో అవినాష్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ హత్యతో అవినాష్‌రెడ్డికి సంబంధం ఉందని నిరూపిస్తే తనతోపాటు జిల్లాలోని 9 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతోపాటు రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకొంటామని ఆయన సంచలన ప్రకటన చేశారు. బాధితులైన వైఎస్ కుటుంబ సభ్యులనే హత్యకు బాధ్యులను చేయడం మనసును కలచి వేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
వివేకా హత్య కేసులో వైఎస్ కుటుంబ సభ్యుల పేర్లు తెరపైకి వచ్చిన మూడు రోజులవుతోంది. ఇంత వరకూ దస్తగిరి వాంగ్మూలంలో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చిన వైఎస్ కుటుంబ సభ్యులైన అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి నోరు తెరవలేదు. ఇది వ్యూహాత్మక మౌనమా? కానీ మౌనం అర్ధంగీకారమని పెద్దలు చెప్పారు. ఆ మాత్రం ఆలోచన ఈ ముగ్గురు వైఎస్ కుటుంబ సభ్యులకు లేదంటారా?
వైఎస్ వివేకా హత్యతో తమకెలాంటి సంబంధం లేదనే మాట ఈ ముగ్గురి నుంచి వచ్చి వుంటే ఎంత బాగుండేదో అని వైసీపీ శ్రేణుల అభిప్రాయం. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే చెప్పిన అంశాల్ని అవినాష్, భాస్కర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి చెప్పి వుంటే నాణేనికి మరోవైపు చూపినట్టైంది. ఆ తర్వాత సీబీఐ సమగ్ర దర్యాప్తులో ఎటూ నిజానిజాలు తేలుతాయి.
అంత వరకైనా కనీసం తాము నిర్దోషులమని, తమ కోసం కాకపోయినా జగన్ కోణంలో ఆలోచించి చెప్పి వుంటే బాగుండేదని వైసీపీ శ్రేణుల అభిమతం. ఇప్పటికైనా వారు స్పందిస్తారో లేదో చూద్దాం.