ప్రపంచాన్ని దాదాపు రెండేళ్ల కిందట నుంచి అతలాకుతలం చేస్తూ వచ్చిన కరోనా వైరస్ – కోవిడ్ -19 గురించి పరిశోధనలు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకూ వైద్య శాస్త్రానికి కోవిడ్ -19 పూర్తి ప్రభావాల గురించి పూర్తి స్థాయిలో స్పష్టత రాలేదని సులువుగా చెప్పవచ్చు.
కోవిడ్-19 ప్రవర్తన వైద్యులకు, పరిశోధకులకు పూర్తి స్థాయిలో అంతుబట్టడం లేదు. పోస్ట్ కోవిడ్ పరిణామాల్లో కొందరు ప్రముఖులు గుండె పోటుకు గురై మరణించడంతో కూడా రకరకాల చర్చలు సాగుతున్నాయి. అయితే కరోనాకు గురై కోలుకోవడానికి, గుండెపోటు రావడానికీ సంబంధం లేదని వైద్యులు స్పష్టం చేస్తూ ఉన్నాయి. రెండింటినీ వేర్వేరుగా చూడాలని అంటున్నారు.
ఆ సంగతలా ఉంటే.. కరోనా ఎలా సోకింది, కొందరికే ఎందుకు సోకింది, మిగతా వారు కరోనా సోకకుండా ఎలా తప్పించుకున్నారు? అనేది కూడా పూర్తి స్థాయిలో స్పష్టత లేని ప్రశ్నలే. ఈ అంశం గురించి కూడా పరిశోధనలు సాగుతున్నాయి. వాటి ఫలితాలు ఏమంటున్నాయంటే…
40 కోట్ల మందికే ఎందుకు?
ప్రపంచ జనాభా ఆరు వందల కోట్ల పై మాటే. ఏడు వందల కోట్లు అనే నంబరూ వినిపిస్తూ ఉంటుంది. మరి ప్రపంచ వ్యాప్తంగా అధికారికంగా నమోదైన కరోనా కేసులు సంఖ్య 40 కోట్ల పై స్థాయిలో ఉంది. ఈ కేసులు ప్రపంచ వ్యాప్తంగా మారుమూల ప్రాంతాల్లో కూడా నమోదైనవే.
కరోనా కేసులు రికార్డు కాని దేశం, రాష్ట్రం, నగరం, పట్టణం దాదాపు ఉండదేమో! అలాంటప్పుడు అందరూ కరోనా బారిన పడకుండా కొందరే ఎందుకు గురయ్యారు? అనే అంశంపై పలు పరిశోధనలు జరిగాయి. వాటిల్లో ఒకటి లండన్ లోని ఇంపీరియల్ కాలేజ్ చేసినపరిశోధన. చాలా మందికి కరోనా సోకకపోవడానికి ప్రధాన కారణం వారి శరీరంలో టీ సెల్స్ స్థాయి పుష్కలంగా ఉండటం.
సాధారణ జలుబు, ఇతర అనారోగ్య సమస్యల వల్ల ఏర్పడిన ఈ వ్యాధినిరోధకతలో భాగమైన ఈ మెమోరీ సెల్స్ ఉండటం వల్ల చాలా మంది కరోనా సోకకుండా బయటపడ్డారని ఈ పరిశోధన చెబుతూ ఉంది. కామన్ కోల్డ్ ను ఎదుర్కొనడం వల్ల ఏర్పడిన ఇమ్యూనిటీ వల్ల వీరు కరోనా కు కోరల్లో చిక్కుకోలేదని ఈ పరిశోధన చెబుతూ ఉంది.
పరీక్షల సంఖ్య తక్కువ!
మూడు వేవ్ ల తర్వాత కూడా 40 కోట్లకు పైగా అధికార కేసులు అంటున్నప్పటికీ.. టెస్టులు మరింతగా జరిగి ఉంటే ఈ సంఖ్య రెట్టింపు అయ్యేదేమో! అనే అంచనాలూ ఉన్నాయి. కొన్ని దేశాల్లో టెస్టుల సంఖ్య పరిమితంగా జరిగి ఉండవచ్చు.
ఇండియా విషయాన్నే తీసుకున్నా.. రెండో వేవ్, మూడో వేవ్ లలో పరీక్షలను పెద్ద సీరియస్ గా తీసుకోలేదు చాలా మంది. పరీక్షలతో సంబంధం లేకుండా చికిత్సలు పొందారు.
అసింప్టమాటిక్ కేసులు!
టీనేజర్లు, చిన్న పిల్లల్లో అసింప్టమాటిక్ కేసుల సంఖ్య భారీగా ఉండవచ్చని అంచనా. ప్రపంచ జనాభాలో వీరి శాతం కూడా 40 శాతం అనుకున్నా.. వీరిలో కరోనా లక్షణాలు బయటపడకుండానే దానికి గురై, కోలుకున్న వాళ్ల శాతం భారీగా ఉండవచ్చని అంచనా. ఇది కూడా ప్రపంచ వ్యాప్తంగానమోదైన కరోనా కేసుల సంఖ్యను ప్రభావితం చేసే అంశమే.
వీళ్లు ఇక ధైర్యంగా ఉండొచ్చా?
మూడు వేవ్ ల కరోనాలో అధికారికంగానో, అనధికారికంగానో కరోనా పాజిటివ్ గానే ఉన్న వారు చాలా వరకూ లక్కీనే. రెండేళ్లుగా కరోనా సహజీవనం చేస్తూ దానికి గురి కాకుండా కొనసాగిన వారు సహజసిద్ధమైన వ్యాధినిరోధకతను కలిగి ఉన్నట్టే.
ఇలాంటి వారు తమ ఇమ్యూనిటీని తలుచుకుని గర్వించవచ్చు. అయినప్పటికీ వ్యాక్సిన్ ను మాత్రం వద్దనవద్దనేది వైద్య పరిశోధకుల సూచన.