టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిలో ఉన్నది, వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌లో లేనిది ఏంటి? గతంలో ఒకట్రెండు సార్లు చంద్రబాబుకు మద్దతు ఇచ్చి మోసపోయానని వాపోయిన జనసేనాని పవన్‌కల్యాణ్ …తాజాగా మరోసారి ఆయన లవ్ ప్రపోజల్ పంపగానే, సానుకూల సంకేతాల్ని ఇవ్వడం పెద్ద చర్చకు దారి తీసింది. వైఎస్ జగన్ అంటే పవన్‌కల్యాణ్‌కు అకారణమైన ద్వేషం, పగ. బహుశా ఇలాంటి ధోరణి గతంలో ఎప్పుడూ ఎవరూ చూసి వుండరు.
రాజకీయాల్లో ప్రత్యర్థులే తప్ప శత్రువులు ఉండరని అంటుంటారు. కానీ జగన్‌పై పవన్ విద్వేషాన్ని చూస్తుంటే, ముఖ్యమంత్రిని ఓ శత్రువులా భావిస్తున్నారని ఎవరికైనా అర్థమవుతుంది. కేవలం తన వెనుక ఉన్న బలమైన సామాజిక వర్గ ఓటు బ్యాంకును సొమ్ము చేసుకునేందుకే పవన్ రాజకీయ నాటకానికి తెరలేపినట్టు విమర్శలొస్తున్నాయి.
2014లో ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్‌ను సీఎం చేయకూడదనే పట్టుదలతో తాను ఎన్నికలకు దూరంగా ఉంటూ, టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతు పలికారు. తనకు వైసీపీ నేతలంటే వ్యక్తిగత ద్వేషం లేదని, విధానాల పరంగా మాత్రమే విమర్శలు చేస్తానని పవన్‌కల్యాణ్ పదేపదే గరికపాటి నరసింహారావు, చాగంటి కోటేశ్వరరావులకు మించి ప్రవచనాలు వల్లిస్తుంటారు. 2019లో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీకి ప్రజలు పట్టం కట్టారు. మూడేళ్లుగా వైసీపీ అధికారంలో ఉంటోంది.
గత మూడేళ్లుగా మాత్రమే జగన్‌ను వ్యతిరేకిస్తుంటే పవన్ మాటల్లో నిజాయతీని అర్థం చేసుకోవచ్చు. అసలు వైఎస్ జగన్ అనే పేరును, ఆయన సామాజిక వర్గం అంటేనే గిట్టనట్టు, పవన్ మాటలు, చేతలే చెబుతున్నాయి. 2014లో జగన్‌ను ఎందుకు వ్యతిరేకించాల్సిన అవసరం పవన్‌కల్యాణ్‌కు ఏమొచ్చింది? పదేపదే ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ సీఎం కాలేరని పవన్ ప్రతిజ్ఞ చేయడం చూడలేదా?
అసలు వైఎస్ జగన్ అనే నాయకుడు తన సమస్యా లేక రాష్ట్ర సమస్యా? ముందు ఈ ప్రశ్నకు పవన్‌కల్యాణ్ సమాధానం ఇవ్వాలి. చంద్రబాబునే సీఎం చేయడానికైతే తాను రాజకీయాల్లోకి ఎందుకొచ్చినట్టు? ప్రశ్నించడానికే జనసేన పార్టీని స్థాపించానని ప్రగల్భాలు పలకడం ఎవరిని మోసం చేయడానికి? తనను పరిటాల రవి గుండు కొట్టించారని విష ప్రచారాన్ని టీడీపీనే చేయించిందని గతంలో పవన్‌కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేయడాన్ని మరిచారా? అలాగే తన తల్లితో పాటు వ్యక్తిగత విషయాలపై చంద్రబాబు అనుకూల మీడియా దుష్ప్రచారం చేయడం వెనుక టీడీపీ ఉందని రచ్చరచ్చ చేయడాన్ని ఏపీ సమాజం మరిచిపోలేదు.
ఇదే జగన్ విషయానికి వస్తే… అసలు పవన్‌కల్యాణ్ అనే వ్యక్తినే ఏనాడు పట్టించుకోలేదు. గెలవకపోయినా ఫర్వాలేదని, పవన్ అనే వ్యక్తిని సాయం చేయకూడదని ఆత్మాభిమానాన్ని గుండెల నిండా నింపుకున్న నాయకుడు జగన్. తనను విస్మరించడ మేనా పవన్ దృష్టిలో జగన్ చేసిన నేరం. చంద్రబాబులా అధికారం, రాజకీయ ప్రయోజనాల కోసం పాహిమాం అని వేడుకోలేదనేనా పవన్ అక్కసుకు కారణం? అడిగితే మద్దతు ఇవ్వడానికే అయితే ప్రత్యామ్యాయ రాజకీయాలనే పెద్దపెద్ద మాటలెందుకు? ఏపీ పౌర సమాజం నుంచి వెల్లువెత్తుతున్న ఈ ప్రశ్నలకు పవన్‌కల్యాణ్ సమాధానాలు ఇవ్వాలి.
ఎవరినో ముంచడం, మరెవరినో గద్దెనెక్కించడమే తప్ప, తాను సీఎం పీఠంపై కూచుని, సేవ చేయాలనే ఆశయం లేని పవన్ సమాజానికి ఎలాంటి సంకేతం ఇవ్వాలని అనుకుంటున్నారో చెప్పాలి.