ఏపీలో కొత్త జిల్లాలను ఒక్క దెబ్బతో రెట్టింపు చేసింది వైసీపీ సర్కార్. దీంతో గతంలో దశాబ్దాల కలగా ఉన్నవి ఈ రోజు సాకారం అయ్యాయి. అసలు ఒక్క రెవిన్యూ డివిజన్ కి అయినా దిక్కు ఉందా అన్న చోట జిల్లాలనే ఇచ్చేశారు. ఇక రెవిన్యూ డివిజన్లు కూడా అడిగిన మేరకు అవసరం చూసుకుని మరీ శాంక్షన్ చేశారు.
ఒక విధంగా కొత్త జిల్లాల వల్ల ఏం జరుగుతుంది, ఏమి ఒరుగుతుంది అని అనేవాళ్ళు అంటున్నా కూడా ఒకటి మాత్రం స్పష్టం. ఒక ఐడెంటిటీ. అది జనాలకు కావాలి. తమ ప్రాంతానికి జిల్లా హోదా వచ్చేసింది అన్న ఆనందం వారిలో ఉంది. దీన్ని అనుకూలంగా చేసుకుని వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు పండుగాలా జిల్లాల ఆవిర్భావాన్ని నిర్వహించారు. అయితే విపక్షాలు మాత్రం జిల్లాల విభజన బాగులేదు అని విమర్శలు చేస్తున్నారు. అశాస్త్రీయం అని కూడా కామెంట్స్ చేస్తున్నారు.
దీని మీద అనకాపల్లి జిల్లాకు చెందిన వైసీపీ యువ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాధ్ గట్టిగానే కౌంటరేశారు. ఇంతకీ పవన్ కళ్యాణ్ ఏంటి మీ బాధ అంటూ సూటిగానే అడిగారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రజలు హ్యాపీగా ఉండగా పవన్ మాత్రం విమర్శలు ఎందుకు చేస్తున్నారో అర్ధం కావడంలేదని గుడివాడ పంచులేశారు.
ఇక ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు సైతం కొత్త జిల్లాల మీద విమర్శించడం దారుణమని గుడివాడ గట్టిగానే సౌండ్ చేశారు. జగన్ తీసుకున్న నిర్ణయం సాహసోపేతమని ఆయన అన్నారు. 13 జిల్లాలను 26గా మార్చి ప్రజల కోరిక మేరకు పరిపాలనా వికేంద్రీకరణ చేసిన ఘనత తమదని ఆయన చెప్పుకున్నారు.
ఆఖరుకు విపక్షాలు ఏం కావాలో కూడా అర్ధం కావడం లేదని అదే వారి అసలు బాధని కూడా గుడివాడ సెటైర్లు వేశారు. మొత్తంగా చూస్తే మీ బాధేంటి అపోజిషన్ బాసులూ అని డైరెక్ట్ గానే అడిగేసి కడిగేసారు అనుకోవాలి.