ప్రశ్నించడం మరిచిపోయావా పవన్!

ప్రశ్నించడానికే పార్టీ పెట్టానన్నాడు. అప్పుడు ఎవ్వరికీ అర్థం కాలేదు. ఎవ్వర్ని ప్రశ్నిస్తారంటూ మీడియా కూడా అడగలేదు. పవన్ తన పార్టీ తరఫున ఎవ్వర్ని ప్రశ్నిస్తాడో ఇప్పుడిప్పుడే జనాలకు అర్థమౌతోంది. కేవలం తనకు గిట్టని వాళ్లను…

ప్రశ్నించడానికే పార్టీ పెట్టానన్నాడు. అప్పుడు ఎవ్వరికీ అర్థం కాలేదు. ఎవ్వర్ని ప్రశ్నిస్తారంటూ మీడియా కూడా అడగలేదు. పవన్ తన పార్టీ తరఫున ఎవ్వర్ని ప్రశ్నిస్తాడో ఇప్పుడిప్పుడే జనాలకు అర్థమౌతోంది. కేవలం తనకు గిట్టని వాళ్లను మాత్రమే జనసేనాని ప్రశ్నిస్తాడనే విషయాన్ని ప్రజలు ఈజీగానే తెలుసుకున్నారు. ఒకవేళ ఇంకా అర్థంకాని జనాలు ఎవరైనా ఉంటే వాళ్లకు కూడా మరింత విపులంగా అర్థమయ్యేలా ప్రస్తుతం ప్రవర్తిస్తున్నారు పవన్.

టీడీపీకి మద్దతిచ్చిన టైమ్ లో చంద్రబాబును పల్లెత్తుమాట అనలేదు పవన్. బాబు, లోకేష్ తో పాటు మిగతా తెలుగుదేశం జనాలు ఎన్ని అక్రమాలు చేసినా చూసీచూడనట్టు ఊరుకున్నారు. ఇప్పుడు బీజేపీ వంతు వచ్చింది. కమలనాథుల పుట్టినరోజుల నాడు పనిగట్టుకొని శుభాకాంక్షలు చెబుతున్న పవన్.. కేంద్రం చేస్తున్న అరాచకాల్ని మాత్రం ప్రశ్నించడం లేదు. ఇందులో ప్రధానమైనది పెట్రో ధరల పెంపు.

పెట్రోల్, డీజిల్ ధరలు ఇష్టానుసారం పెరిగిపోతున్నాయి. లాక్ డౌన్ టైమ్ లో ఏర్పడిన నష్టాలను పూడ్చుకునేందుకు చమురు సంస్థలు ధరలు పెంచుతున్నాయి. అది వ్యాపారం కాబట్టి కాదనలేం. మరి కేంద్రం ఏం చేస్తోంది. ప్రజలపై భారం పడుతుంటే కనీసం పన్నుభారం తగ్గించాలన్న కామన్ సెన్స్ కూడా లేదా. ఇవేవీ పవన్ కు కనిపించడం లేదిప్పుడు.

ఇదేదో ఒక్క రోజులో జరిగిన పెంపు కాదు. అమాంతం పెరిగితే వ్యతిరేకత వస్తుందని, దశలవారీగా రోజురోజుకు పెంచుతున్నారు. అలా 13 రోజులుగా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇలా కొన్ని రోజులుగా పెట్రో-డీజిల్ ధరలు పైపైకి ఎగబాకుతున్నప్పటికీ పవన్ కు పట్టడం లేదు. 

పెట్రోలు,  డీజిల్ ధరలు పెరిగితే ఏమౌతుందో పవన్ కు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ప్రభావం నిత్యావసరాల మీద పడుతుంది. పాలు, ఉప్పు నుంచి  ప్రతి సరుకుపై రేటు పెరుగుతుంది. ఇది వినియోగదారుడికి మరింత భారం. ఇంకా చెప్పాలంటే ప్రజలకు నేరుగా ఇబ్బంది కలిగించే అంశం పెట్రోలు, డీజిల్ ధరల  పెంపకం. ఇలాంటి కీలకమైన అంశంపై కేంద్రం నోరు విప్పడం లేదు. వాళ్లను ప్రశ్నించాల్సిన పవన్ మౌనముని అవతారం ఎత్తారు.

ఈ నెలలో పవన్ ఏఏ అంశాలపై స్పందించారో సంక్షిప్తంగా చూద్దాం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పడం నుంచి ప్రారంభిస్తే.. సింగరేణి ప్రమాదంపై స్పందించారు. పర్యావరణాన్ని పరిరక్షిద్దామంటూ పిలుపునిచ్చారు. ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు చెప్పారు. అచ్చెన్నాయుడు వ్యవహారంపై స్పందించారు. జగన్ బడ్జెట్ పై విమర్శలు గుప్పించారు. ఇన్ని చేసిన పవన్ కు 13 రోజులుగా పెరుగుతున్న పెట్రోధరలు కనిపించక పోవడం విడ్డూరం.

పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అసలే జీతాలు అరకొరగా వస్తున్నాయి. చాలామంది ఉద్యోగాలు కూడా పోగొట్టుకున్నారు. ఇలాంటి టైమ్ లో పెట్రోల్ ధరలు పెరిగితే ఎంత నష్టమో పవన్ కు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ప్రజలంతా పవన్ ను ప్రశ్నించమని కోరుతున్నారు. 

ఎన్టీఆర్ ఆత్మ యనమలని క్షమించదు

ఈ అజ్ఞానికి కొంచెం కూడా జ్ఞానం లేదు