అటు లాక్ డౌన్.. ఇటు స్కూల్ రీఓపెన్.. ఏది నిజం..?

ఓవైపు రాష్ట్రంలో జిల్లాల వారీగా లోకల్ లాక్ డౌన్ కొనసాగుతోంది. ప్రభుత్వం దృష్టిలో కేవలం నైట్ కర్ఫ్యూ మాత్రమే రాష్ట్రవ్యాప్తంగా అమలులో ఉంది, కానీ స్థానిక అధికారులు ఎక్కడికక్కడ ఆంక్షలు పెట్టేశారు. దాదాపు 6-7…

ఓవైపు రాష్ట్రంలో జిల్లాల వారీగా లోకల్ లాక్ డౌన్ కొనసాగుతోంది. ప్రభుత్వం దృష్టిలో కేవలం నైట్ కర్ఫ్యూ మాత్రమే రాష్ట్రవ్యాప్తంగా అమలులో ఉంది, కానీ స్థానిక అధికారులు ఎక్కడికక్కడ ఆంక్షలు పెట్టేశారు. దాదాపు 6-7 జిల్లాల్లో ఇదే పరిస్థితి. కొన్ని చోట్ల సాయంత్రం 6 గంటల వరకు పర్మిషన్ ఉంటే, మరికొన్ని చోట్ల మధ్యాహ్నానికే అన్నీ క్లోజ్. ఇంకొన్ని చోట్ల కేవలం ఉదయం 6 నుంచి 10 గంటల వరకే బయట తిరిగేందుకు అనుమతి.

ఈ దశలో ఈనెల 16 నుంచి స్కూల్స్ పునఃప్రారంభం అయితే పరిస్థితి ఏంటి..? ఎప్పటిలాగే ఆగస్ట్ 15వరకు ఈ విషయంపై సాగదీసి చివరకు 15వతేదీ రాత్రికి 'రేపటినుంచి స్కూల్స్ లేవు' అని ప్రభుత్వం ప్రకటిస్తుందా..? అనేది తేలాల్సి ఉంది.

గతంలో కూడా టెన్త్, ఇంటర్ పరీక్షల విషయంలో ప్రభుత్వం ఇలాంటి సాగదీత ధోరణినే అవలంబించింది. పరీక్షలు పెట్టడానికే ప్రభుత్వం మొగ్గు చూపినా.. చివరకు ప్రతిపక్షాలు కోర్టులకెక్కడంతో పరిస్థితి మారిపోయింది. కోర్టు గట్టిగా గదమాయించే సరికి పరీక్షల్లేవు అని తేల్చేశారు. ఈ విషయంలో తప్పు ప్రతిపక్షాలదే అయినా, దాని ఫలితం అనుభవించింది మాత్రం వేలాదిమంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు.

అవును, పరీక్షలు ఉంటాయనే భయంతో చదువుకోవడం ఒకతీరు. పరీక్షలు ఉంటాయో లేవో తెలియని సందిగ్ధంలో చదవడం నిజంగా నరకమే. అలా చదివి చదివీ ర్యాంకర్లు పదికి పది జీపీఏ సాధిస్తే.. ఏమీ చదవకుండానే యావరేజ్, బిలో యావరేజ్ స్టూడెంట్స్ కూడా పదికి పది జీపీఏ తెచ్చుకున్నారు. మరి చదివినవారికి విలువెక్కడ..?

కనీసం ఇప్పుడైనా ప్రభుత్వం స్కూళ్లు తిరిగి ప్రారంభించే విషయంలో క్లారిటీ ఇస్తే బాగుంటుంది. ఇంకా వారం రోజులే సమయం ఉంది. ఓవైపు ఉపాధ్యాయులు జగనన్న విద్యా కానుక పంపిణీ కోసం కసరత్తులు చేస్తున్నారు. ఆగస్ట్ 16న జరిగే నాడు-నేడు కార్యక్రమాల కోసం హడావిడి పడుతున్నారు. ఇటు తల్లిదండ్రులు మాత్రం పిల్లలకు స్కూల్స్ ఉంటాయో లేదో తెలీని పరిస్థితిలో అయోమయంలో పడ్డారు.

దాదాపుగా విద్యాకానుక కిట్లు ఇచ్చేసి ఇక ఇంటికెళ్లి చదువుకోండి అని చెప్పేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఒకవేళ అదీ కుదరకపోతే, 9, 10 తరగతి విద్యార్థులకు తరగతి బోధన జరిగేలా చూసి, మిగతావారికి హోమ్ వర్క్ లు, అసైన్ మెంట్లు, ఆన్ లైన్ బోధన చేసే ప్రయత్నాలు చేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు. ఒకవేళ అందరికీ స్కూల్స్ ఉన్నా.. కేవలం ఒంటిపూట వరకే దాన్ని పరిమితం చేస్తారని తెలుస్తోంది.

ఈ గందరగోళంపై విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయ వర్గాల ఆందోళన, అనుమానాలు త్వరగా నివృత్తి చేస్తే మంచిది. సాగదీసి సాగదీసి చివరకు స్కూళ్లు లేవు అంటూ తుస్సుమనిపిస్తే మాత్రం ప్రభుత్వానికే చెడ్డపేరు.