హిందూపురం వద్దనుకున్నారని, కుప్పం కాదనుకున్నారని, సాహసం చేసి మంగళగిరి వచ్చారని లోకేష్ గురించి చాలా గొప్పలు చెప్పుకుంటుంటారు టీడీపీ నాయకులు. మరి ఆ సాహసాల చినబాబుకి తాజా సవాల్ స్వీకరించే దమ్ముందా..?
టీడీపీ భావి నాయకుడు ఎవరనే విషయంపై పార్టీలో బ్యాలెట్ ఓటింగ్ జరిగితే గెలిచే సత్తా లోకేష్ కి ఉందా..? నిజంగానే బ్యాలెట్ బాక్సుల్లో అంతర్గత పోలింగ్ జరిగితే.. ఏ ఒక్కరూ లోకేష్ నాయకత్వం కోరుకోరు. లోకేష్ కి అంత సీన్ ఉంటే.. గత ఎన్నికల్లోనే ఆయన నాయకత్వంలో పార్టీ బరిలో దిగి ఉండేది. దొడ్డిదారిన పదవి కట్టబెట్టినా కూడా అయ్యవారి అసమర్థత ఏ స్థాయిలో ఉందో గత ఐదేళ్లలో పార్టీ నేతలకు అర్థమైంది. అందుకే ఈసారికి బాబు నాయకత్వంలోనే కానిచ్చేద్దాం అని ఒకేమాటమీద నిలబడి చినబాబుని పక్కనపెట్టారు.
ఓ దశలో లోకేష్ పాదయాత్రకు కూడా సిద్ధమయ్యారనే వార్తలొచ్చాయి. అప్పుడు కూడా కొంతమంది ముందుచూపుతో చినబాబుని ఇల్లు కదలకుండా చేశారు, 23 సీట్లయినా దక్కేలా చూసుకున్నారు. లోకేష్ ఎమ్మెల్యేగా పోటీ చేసేనాటికి ఆయన స్వయానా ఓ ఎమ్మెల్సీ. మంత్రి కూడా. ఏకంగా ఎన్టీఆర్ కు మనవడు, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కొడుకు. ఇన్ని క్వాలిఫికేషన్లు ఉండి కూడా లోకేష్ దారుణంగా ఓడిపోయారు. 5వేల పైచిలుకు ఓట్ల తేడాతో బొక్కబోర్లా పడ్డారు. ఇలాంటి వ్యక్తిని టీడీపీకి కెప్టెన్ గా చేయాలంటే ఎవరు ఒప్పుకుంటారు?
అసలు ఇవన్నీ ఎందుకు.. నేరుగా చంద్రబాబుకి తన వారసుడు లోకేష్.. అని ప్రకటించే ధైర్యం ఉందా. మీరంతా ఇకపై లోకేష్ నాయకత్వంలో పనిచేయండి అని క్యాడర్ కు చెప్పే సాహసం బాబు చేయగలరా. ఆ ధైర్యం లేకే ఇప్పటి వరకూ సతమతమవుతున్నారు చంద్రబాబు. కేవలం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అనే హోదా ఇచ్చి సరిపెట్టారు.
అయితే ఎప్పటికైనా టీడీపీకి లోకేష్ ని అధినేతను చేయాలనేది బాబు ఆలోచన. ఇప్పటికే పార్టీ పతనావస్థకు చేరుకుంది, ఇక లోకేష్ చేతుల్లోకి పగ్గాలు వెళ్తే ఆ పతనం సంపూర్ణం అవుతుంది.