“ఈ సినిమాలో వచ్చిన చిన్న పాటి తప్పులను కూడా నెక్ట్స్ సినిమాలో లేకుండా చూసుకుంటాం. హిట్ కేస్ 2 ని నేనే నిర్మిస్తున్నాను. ఆల్రెడీ మంచి కథను శైలేష్ సిద్ధం చేశాడు. ప్రతి పాత్ర నాకు బాగా నచ్చింది.” నాని తాజా స్టేట్ మెంట్ ఇది.
హిట్ సినిమాలో ప్రీతి మర్డర్ మిస్టరీని ఛేదిస్తాడు హీరో. అంతా సుఖాంతం అయిందనుకున్న టైమ్ లో అతడిపై గన్ తో ఎటాక్ జరుగుతుంది. సరిగ్గా అక్కడే ఎండ్ కార్డ్ పడుతుంది. హిట్.. కేస్-2 అనే టైటిల్ వస్తుంది. అలా ఈ సినిమాకు సీక్వెల్ ఉందనే విషయాన్ని బయటపెట్టారు. ఆ తర్వాత నాని కూడా సీక్వెల్ ను ఘనంగా ప్రకటించాడు. అయితే గతంలో ఇలానే ప్రకటించిన ఓ సీక్వెల్ ను మాత్రం ఈ హీరో మరిచిపోయాడు.
అవును.. తొలిసారి నిర్మాతగా మారి తీసిన “అ!” అనే సినిమా టైమ్ లో కూడా సీక్వెల్ ప్రకటించాడు నాని. కానీ దాన్ని వదిలేశాడు. రీసెంట్ గా ఆ సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మ సీక్వెల్ స్క్రిప్ట్ రెడీ అయిందని ప్రకటించాడు కూడా. అయినప్పటికీ నాని నుంచి రెస్పాన్స్ లేదు.
అలా “అ!” సినిమాను ఆయాచితంగా మరిచిపోయిన నాని హిట్ సినిమాకు మాత్రం సీక్వెల్ తీస్తానంటూ ప్రకటించాడు. క్లైమాక్స్ బాగాలేదంటూ బాక్సాఫీస్ బరిలో యావరేజ్ రిజల్ట్ రాబట్టుకున్న ఈ సినిమాకైనా అతడు సీక్వెల్ తీస్తాడో లేదో మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది. మంచి వసూళ్లు వస్తే ఓకే, లేదంటే ఇది కూడా “అ!” సినిమా లిస్ట్ లో చేరిపోతుంది. కొసమెరుపు ఏంటంటే.. నిర్మాతగా మారి నాని తీసిన 2 సినిమాలు సీక్వెల్ సబ్జెక్టులే కావడం విశేషం