ఎన్టీఆర్ భవన్ పై బాబు ఆశలు వదులుకుంటే బెటర్

హైదరాబాద్ లో ఎన్టీఆర్ భవన్, ఇక టీడీపీకి దక్కనట్టే. దీనిపై కేసీఆర్ కన్నేశారు. స్వయంగా ఎన్టీఆర్ భవన్ లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు ఆమధ్య కేసీఆర్ కు లేఖ రాశారు. ఎలాంటి ఛారిటీ కార్యక్రమాలు,…

హైదరాబాద్ లో ఎన్టీఆర్ భవన్, ఇక టీడీపీకి దక్కనట్టే. దీనిపై కేసీఆర్ కన్నేశారు. స్వయంగా ఎన్టీఆర్ భవన్ లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు ఆమధ్య కేసీఆర్ కు లేఖ రాశారు. ఎలాంటి ఛారిటీ కార్యక్రమాలు, పార్టీ వ్యవహరాలు సాగడం లేదని, భవనాన్ని స్వాధీనం చేసుకోవాలని కోరారు. దీనికి మరింత ఊతమిచ్చేలా బాబు వ్యవహర శైలి ఉంది. 

హైదరాబాద్ లో ఉంటారు కానీ ఎన్టీఆర్ భవన్ కు మాత్రం వెళ్లరు. అక్కడ తన పార్టీకి చెందిన సోషల్ మీడియా వ్యవహారాలు లాంటివి నడిపిస్తారని టాక్. వందల కోట్ల రూపాయల విలువైన భవనం చేజారిపోకుండా ఉండేందుకు పైకి మాత్రం ఛారిటీ కార్యక్రమాలు చేస్తున్నట్టు కలరింగ్ ఇస్తారని చెబుతున్నారు.

చంద్రబాబు స్కెచ్ ఇది

కేవలం బంజారాహిల్స్ లో ఉన్న వందల కోట్ల రూపాయల భవనాన్ని కాపాడుకునేందుకే తెలంగాణలో కూడా తమ పార్టీ ఉందని బాబు చెప్పుకుంటారు. కొత్తగా టీటీడీపీ అధ్యక్షుడ్ని కూడా నియమించింది ఇందుకే అంటారు. 

అప్పుడప్పుడు కొంతమంది కాంట్రాక్ట్ జనాల్ని పెట్టి హైదరాబాద్ లో హడావుడి చేయడం, అనుకూల మీడియా పత్రికలు, ఛానెళ్లలో కథనాలు వేయించడం లాంటివి చేస్తుంటారు. ఇవన్నీ రాజకీయ లబ్ది కోసం కాదు, ఈ భవనాన్ని కాపాడుకోవడం కోసమే. కనీసం ఈ భవనం కోసమైనా తెలంగాణలో టీడీపీ ఉనికిని చాటుకోవడం చంద్రబాబు లక్ష్యం.

కేసీఆర్ స్కెచ్ ఇది

2027తో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లీజ్ అయిపోతుంది. వచ్చే దఫా కూడా తన పార్టీనే అధికారంలోకి వస్తుందనే నమ్మకం ఉంటే కేసీఆర్ అంతవరకు ఆగొచ్చు. లీజ్ గడువు ముగిసిన తర్వాత కాంట్రాక్ట్ రద్దు చేయొచ్చు. అంతవరకు కూడా ఆగలేకపోతే.. ఈలోగానే లీజును పునఃపరిశీలించి రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. పైపెచ్చు, ఇక్కడ కేసీఆర్ ఓ రకమైన సెంటిమెంట్ ను కూడా పైకి తీశారు. 

పెద్ద ఎన్టీఆర్ కు సిసలైన మెమోరియల్ గా దాన్ని మారుస్తామంటూ నేరుగా చెప్పకుండా, ప్రభుత్వం వర్గాల నుంచి లీకులు వదులుతున్నారు. కాబట్టి లీజు రద్దు చేసినా ఎవ్వరూ అభ్యంతరం చెప్పే ఆస్కారం ఉండదు.

ఏం జరగబోతోంది?

చూస్తుంటే మరో ఆరేళ్లలో భవనం చంద్రబాబు చేజారేలా ఉంది. ఎందుకంటే అప్పటికి తెలంగాణలో టీడీపీ పూర్తిగా భూస్థాపితం అవుతుంది. ఒకవేళ టీఆర్ఎస్ రాకపోయినా, చంద్రబాబు అనుకూల పార్టీ ఏదీ అధికారంలోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ట్రస్ట్ భవన్ కు ఢోకా లేదు.  

ఎందుకంటే, అక్కడున్నది చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి. కానీ కనుచూపుమేరలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పలేం. రేవంత్ రాకతో ఎప్పట్లానే ఆ పార్టీలో ఈసారి కూడా అంతర్గత కుమ్ములాటలు ఎక్కువయ్యాయి. కాబట్టి లీజు గడువు ముగిసిన తర్వాత భవన్ పై చంద్రబాబు తన హక్కును కోల్పోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.