ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను రాజ్యసభ సభ్యుడు, బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో బుధవారం కలుసుకున్నారు. అయితే ఇది మర్యాదపూర్వక కలయికే అని సీఎం కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. కానీ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో కలిసి సీఎంను సుబ్రమణ్యస్వామి కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
తన సన్నిహితునికి టీటీడీ బోర్డు సభ్యత్వాన్ని ఇప్పించుకోవడం లేదా ఎంపిక చేసినందుకు కృతజ్ఞత తెలిపేందుకు సీఎంను సుబ్రమణ్యస్వామి కలిసినట్టు విశ్వసనీయ సమాచారం. గత బోర్డులో కూడా సుబ్రమణ్యస్వామి సిఫార్పు మేరకే ఓ వ్యక్తికి సభ్యత్వం ఇచ్చినట్టు సమాచారం.
ఆ కృతజ్ఞతతోనే పార్టీ విధానాలను కాదని టీటీడీ విషయంలో జగన్ ప్రభుత్వాన్ని సుబ్రమణ్య స్వామి వెనకేసుకొస్తున్న విషయాన్ని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలో టీటీడీపై ఎల్లో మీడియాలో తప్పుడు కథనాలపై సుబ్రమణ్యస్వామి కోర్టులో కేసు వేయడాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు.
తాజాగా టీటీడీకి కొత్త పాలక మండలి సభ్యుల జాబితాను ఫైనల్ చేస్తున్న నేపథ్యంలో సీఎంను సుబ్రమణ్యస్వామి కలవడం చర్చకు తెరలేపింది. ఈ బోర్డులో కూడా ఆయన సిఫార్సు చేసిన వ్యక్తిని ఎంపిక చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
జగన్ సమీకరణలకు ఓ లెక్క ఉండే విషయం తెలిసిందే. ఆ దృష్టితో చూస్తే… సుబ్రమణ్యస్వామి సన్నిహితునికి టీటీడీ బోర్డులో స్థానం కల్పించడం ఆశ్చర్యం కలిగించదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.