తెలుగుదేశం నేత, మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి వర్సెస్ తెలుగుదేశం లోని కొంతమంది నేతల మధ్యన రచ్చ సాగుతూ ఉంది కొన్ని నెలలుగా. ఆ మధ్య పల్లెపై బహిరంగంగా ధ్వజమెత్తారు జేసీ ప్రభాకర్ రెడ్డి. తెలుగుదేశంలోని మిగతా నేతలపై విరుచుకుపడుతూ పల్లెను ప్రత్యేకంగా టార్గెట్ చేశారు ప్రభాకర్ రెడ్డి. ఆ తర్వాత ప్రభాకర్ రెడ్డికి పల్లె ఏదో కౌంటర్ ఇచ్చారు. అయితే ఆ పోరు ఆగిపోలేదు. ఆ తర్వాత పుట్టపర్తి నియోజకవర్గం పర్యటనకు వెళ్లారు జేసీ ప్రభాకర్ రెడ్డి!
అక్కడ పల్లెకు వ్యతిరేక వర్గాన్ని ఊపందించే ప్రయత్నం చేశారు జేసీ. అందులో భాగంగా టీడీపీ లోని పల్లె అంటే పడని వారిని ప్రత్యేకంగా పిలుచుకుని మాట్లాడారు. అలా నిప్పు రాజేసి వెళ్లారు జేసీ. అప్పటి నుంచి అది ఏదోలా మంట రేపడానికి ప్రయత్నిస్తూ ఉంది. పుట్టపర్తి నియోజకవర్గం తెలుగుదేశంలో పల్లె అంటే పడని వారు ఉండనే ఉన్నారు. ఏ పార్టీ అయినా అధికారంలో లేకపోతే వర్గాలు లేవడం సహజమే. పార్టీ అధికారంలో ఉన్నా, చేతిలో ఎమ్మెల్యే పదవి ఉన్నా.. నేతలు తమ వ్యతిరేక వర్గాన్ని తొక్కేస్తారు. అయితే ఇవి రెండూ లేనప్పుడు చిన్న వర్గాలు కూడా పెద్ద రచ్చ చేయగలవు.
ఇప్పుడు పల్లెపై అలాంటిదే జరుగుతూ ఉన్నట్టుగా ఉంది. పల్లెను వ్యతిరేకిస్తూ పుట్టపర్తి నియోజకవర్గంలో ఇప్పుడు రచ్చ చేస్తున్నది పీసీ గంగన్న అనే వ్యక్తి. ఇతడు చాలా కాలం నుంచినే రాజకీయాల్లో ఉన్నారు. 1999లో గోరంట్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాడీయన. అప్పటి కాంగ్రెస్ నేత పాముదుర్తి రవీంద్ర రెడ్డిని కాదని కాంగ్రెస్ బీసీ కోటాలో గంగన్నకు టికెట్ ఇచ్చింది. రవీంద్రరెడ్డి అప్పుడు ఇండిపెండెంట్ గా పోటీలో నిలిచారు. త్రిముఖ పోరులో టీడీపీ అభ్యర్థి నిమ్మల కిష్టప్ప విజయం సాధించాడు. ఆ తర్వాత పీసీ గంగన్న రాజకీయాల్లో పెద్ద ప్రాధాన్యత పొందలేకపోతున్నా బీసీ కోటాలో ఉనికి చాటే ప్రయత్నం చేస్తున్నాడు.
బీసీ ఓటు బ్యాంకు గణనీయంగా ఉన్న నియోజకవర్గాల్లో పుట్టపర్తి కూడా ఒకటి. బోయ సామాజికవర్గం కూడా ఇక్కడ ఎక్కువ. ఇదే సామాజికవర్గం గంగన్నది. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గం టీడీపీ టికెట్ బోయలకు దక్కాలనే డిమాండ్ ను తెరపైకి తెస్తున్నట్టుగా ఉన్నారు. పునర్విభజనకు పూర్వం టీడీపీ నుంచి నిమ్మల కిష్టప్ప ఈ నియోజకవర్గం నేతగా వ్యవహరించారు. అయితే పునర్విభజనతో పల్లె రఘునాథరెడ్డి ఈ నియోజకవర్గానికి వచ్చారు. కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ.. ఇలా మూడు పార్టీల విషయంలోనూ రెడ్లే ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ తరఫు నుంచి కడపల మోహన్ రెడ్డి ఒక సారి ఎమ్మెల్యేగా చేశారు. ఆ తర్వాత పల్లె రఘునాథ రెడ్డి గెలిచారు, 2019లో దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి విజయం సాధించారు.
ఇప్పుడు టీడీపీలోనేమో బీసీ నినాదం వినిపిస్తూ ఉంది. ఇదే సమయంలో ఆసక్తిదాయకమైన విషయం నిమ్మల కిష్టప్ప మళ్లీ ఎంట్రీ ఇచ్చే యత్నం చేయడం! గతంలో తనకు వ్యతిరేకంగా పోటీ చేసిన గంగన్నతో నిమ్మల చేతులు కలిపారు. వీరంతా జాయింటుగా బీసీలకే పుట్టపర్తి నియోజకవర్గం టికెట్ అనే నినాదాన్ని చేస్తున్నట్టుగా ఉన్నారు.
నిమ్మల కిష్టప్ప నేసే సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. హిందూపురం నుంచి ఎంపీగా వ్యవహరించి, గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు హిందూపురం ఇన్ చార్జి పదవి కూడా ఆయనకు లేదు. దీంతో మళ్లీ ఆయనకు పుట్టపర్తి వైపు గాలి మళ్లిందా? అనే సందేహాలు వస్తున్నాయి. బీసీ నినాదంతో పల్లెకు చెక్ పెట్టి.. పుట్టపర్తి టికెట్ కు నిమ్మల పోటీదారుడు అయ్యే అవకాశాలు లేకపోలేదు.
అయితే పల్లె మాత్రం.. పట్టు విడవడం లేదని స్పష్టం అవుతోంది. పార్టీలో నియోజకవర్గం వరకూ తనే సుప్రీం అని.. ఎవరైనా ఎక్కువ చేస్తే సస్పెన్షనే అని ఆయన హెచ్చరిస్తున్నారట. అలాగే ఇప్పుడిప్పుడు పల్లె మళ్లీ పల్లెల టూర్లు మొదలుపెట్టి, నియోజకవర్గంలో తన పట్టు మరీ జారిపోకుండా చూసుకుంటున్నట్టున్నారు!