కేంద్ర బడ్జెట్ ప్రకటన విషయంలో ఏపీకి మరోసారి అన్యాయం జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. ఏపీకి ప్రత్యేకహోదాతో సహా అనేక అంశాల్లో అన్యాయం జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యాఖ్యానించారు. ఏపీ ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన, వైఎస్ఆర్సీపీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి తదితరులు కేంద్ర బడ్జెట్ పై స్పందించారు. బడ్జెట్ లో ఏపీకి జరిగిన అన్యాయం తీరుపై వారు రకరకాల పాయింట్లను స్పందించారు. బీజేపీ ఎన్నికల హామీ అయిన ఏపీకి ప్రత్యేకహోదాతో సహా వివిధ అంశాలపై మొండిచేయి చూపారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు స్పందించారు.
కేంద్ర బడ్జెట్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల స్పందన అలా ఉండగా.. ఈ బడ్జెట్ విషయంలో కేంద్రాన్ని పల్లెత్తు మాట అనే ప్రయత్నం చేయలేదు తెలుగుదేశం పార్టీ. మోడీని కానీ, మోడీ ప్రభుత్వ బడ్జెట్ మీద కానీ తెలుగుదేశం కించిత్ స్పందించలేకపోయింది. ఈ బడ్జెట్ లోని డొల్లతనాలను తెలుగుదేశం పార్టీ ఎత్తలేకపోయింది. అంతే కాదు.. ఏపీకి జరిగిన అన్యాయాల గురించి కూడా తెలుగుదేశం పార్టీ స్పందించకపోవడం గమనార్హం!
అదేమంటే.. ఈ అన్యాయమంతా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వల్లనే అంటూ టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు చెప్పుకొచ్చారు. ఏపీకి నిధులు వద్దు అని ముఖ్యమంత్రి ప్రధానికి లేఖ ఇచ్చారట. అందుకే కేంద్రం ఏపీకి నిధులు కేటాయించలేదట.. ఇదీ యనమల చెప్పుకొచ్చిన విషయం. ఆఖరికి బీజేపీ వాళ్లు కూడా వెనకేసుకు రాలేని తీరులో కేంద్రాన్ని తెలుగుదేశం పార్టీ వెనకేసుకు వస్తున్నట్టుగా ఉంది.
తమ హయాంలో బీజేపీతో నాలుగేళ్ల పాటు దోస్తీ చేసి తెలుగుదేశం ఏం సాధించుకురాలేకపోయింది. అప్పుడేమో ఆహా..ఓహో.. లతో సరిపోయింది. తీరా ఎన్నికల ఏడాది చంద్రబాబుకు రక్తం మరిగిపోయింది. ఇప్పుడేమో.. మళ్లీ బీజేపీ ప్రాపకం కోసం ఏపీకి అన్యాయం జరిగినా మోడీని ఒక్క మాట అనలేక, కనీసం అన్యాయం జరిగింది అని కూడా చెప్పలేక.. జగన్ ను విమర్శించేస్తే తన పని అయిపోతుందన్నట్టుగా తెలుగుదేశం వాళ్లు రియాక్ట్ అవుతున్నారు. వీళ్ల దివాళాకోరుతనం పతాక స్థాయికి చేరినట్టుగా ఉంది!