రాజకీయాలు అంటే ఇలాగే ఉంటాయి మరి. చాన్స్ వచ్చేంతవరకూ ఉండకూడదు, దాన్ని తీసేసుకోవాల్సిందే. ఇపుడు లోకల్ బాడీ ఎన్నికలలో గెలిచి వైసీపీ మంచి ఊపు మీద ఉన్న సంగతి తెలిసిందే.
మరి ఇదే ఊపులో ఒక పని కానిచ్చేస్తే పోలా అన్నదే వైసీపీ మాస్టర్ ప్లాన్. కొన్నాళ్ళ క్రితమే విశాఖ దక్షిణం టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సైకిల్ దిగిపోయి వైసీపీ కి జై అనేశారు. అలాగే విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్టీల్ ప్లాంట్ ప్రీవేటీకరణ అంశం మీద ఈ రాజీనామా చేశారు.
ఏపీలో మరో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా వైసీపీకి మద్దతు ఇస్తూ సొంత పార్టీకి ఏనాడో దూరం జరిగారు. దీంతో ఇపుడు వైసీపీ అదిరిపోయే వ్యూహం రచిస్తోందిట. ఈ ఎమ్మెల్యే సీట్లన్నింటికీ ఉప ఎన్నికలు అర్జంటుగా తేవడమే ఆ ప్లాన్.
అనుకున్నది కనుక జరిగితే కడపలో జరిగే ఉపఎన్నికతో పాటే వీటికీ ఎన్నికలట. అంటే విశాఖలో పాలనా రాజధాని అంటున్న వైసీపీ అటు ఉత్తరాన్ని, ఇటు దక్షిణాన్ని కూడా కదిపి కుదిపేస్తుందన్నమాట.
ఎటూ అధికార పార్టీ, మరో మూడేళ్ల దాకా పవర్ చేతిలో ఉంటుంది. దాంతో ఈ సీట్లు అన్నీ వైసీపీ పరం అవడం ఖాయమే. మొత్తానికి టీడీపీకి గట్టి ఝలక్ ఇచ్చేందుకు వైసీపీ రెడీ అయిపోతోందిగా.