ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌తో గొడవ అధికార పార్టీ వైసీపీకి తీవ్ర నష్టం కలిగించింది. ఈ అభిప్రాయాన్ని ఆ పార్టీ నాయ కులు, కార్యకర్తలే చెబుతుండడం విశేషం. దేనినైనా ప్రేమతో గెలవొచ్చు. శత్రుత్వం వల్ల పగలు, ప్రతీకారాలు మరింత పెరుగుతాయి. రాజకీయాలంటే పట్టువిడుపులుంటాయి. ఆ సూక్ష్మం తెలిసి కూడా మొండిగా వ్యవహరిస్తే మాత్రం అసలుకే ఎసరొస్తుంది. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ వ్యవహారంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వేసిన ఒక్క తప్పటడుగు …అనేక తప్పులు చేసేలా ప్రేరేపించింది.
ఏదో ఒక దశలో తప్పును సరిదిద్దుకోకపోగా ….తెగే వరకూ లాక్కుంటూ వెళ్లారు. రాజ్యాంగ వ్యవస్థ పదవిలో ఉన్న ఎస్ఈసీతో జగడం వల్ల నిమ్మగడ్డ కంటే తానే ఎక్కువ నష్టపోతానని జగన్ ప్రభుత్వం ఆలోచించినట్టు లేదు. నిమ్మగడ్డ పోగొట్టుకోడానికి ఆయనకేమీ లేదు. ఎందుకంటే ఆయన బలం రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఎస్ఈసీ పదవి మాత్రమే.
కేవలం ప్రజాదరణ ఒక్కటే రాజకీయాల్లో కొలబద్ద కాదనే వాస్తవాన్ని జీర్ణించుకోలేని తనమే జగన్‌కు పదేపదే చిక్కులు తెస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కయ్యానికైనా, వియ్యానికైనా సమ ఉజ్జి ఉండాలని పెద్దలు చెబుతారు. కానీ జగన్ ప్రభుత్వ తీరే సపరేట్. నచ్చితే నెత్తిన పెట్టుకోవడం, నచ్చకపోతే నరకం చూపడం… ఈ రెండు విద్యలు బాగా తెలిసిన ప్రభుత్వం ఇది. ఎస్ఈసీతో వైరం వల్ల క్షేత్రస్థాయిలో తాము నష్టపోవాల్సి వస్తోందని గ్రామీణ, పట్టణ వైసీపీ నాయకులు వాపోతున్నారు. ఒక వైపు ఏకగ్రీవాల కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నా… ఆశించిన ఫలితాలు రాలేదన్నది పచ్చి నిజం.
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ వ్యవహార శైలిని ఎన్నికల వాయిదాకు ముందు, ఆ తర్వాత అని విభజించి మాట్లాడుకోవాలి. అప్పుడు నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ అంటే ఎవరో కూడా ఎవరికీ తెలియదు. ఇప్పుడు నిత్య నామస్మరణ అయింది. దీనంతటికి జగన్ ప్రభుత్వం అనుసరించిన విధానాలే కారణం అని చెప్పక తప్పదు. అప్పుడప్పుడే దేశంలో కరోనా విస్తరిస్తున్న క్రమంలో గత ఏడాది మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ఎస్ఈసీ నిమ్మగడ్డ అర్ధాంతరంగా వాయిదా వేశారు.
నిమ్మగడ్డ నిర్ణయంపై జగన్ ప్రభుత్వం షాక్‌కు గురైంది. నిమ్మగడ్డ నిర్ణయంపై సీఎం జగనే నేరుగా తన నిరసన ప్రకటించారు. తన సామాజిక వర్గానికి చెందిన చంద్రబాబుకు రాజకీయ లబ్ధి కలిగించేందుకే నిమ్మగడ్డ కనీసం ప్రభుత్వంతో సంప్రదించకుండానే ఎన్నికలను అర్ధాంతరంగా వాయిదా వేశారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎస్ఈసీతో మున్ముందు కలిసి పనిచేయాలనే ఆలోచన ఉన్న వాళ్లెవరూ ఇలా వ్యవహరించరనే అభిప్రాయాలు అప్పట్లోనే వ్యక్తమయ్యాయి.
నాడు మొదలైన వార్ …ఆ తర్వాత ఇంతింతై అన్నట్టు పెరిగి పెద్దదవుతూ వచ్చింది. ప్రధాన ప్రతిపక్షం చంద్రబాబు కంటే నిమ్మగడ్డే తమకు ప్రధాన ప్రత్యర్థి, శత్రువు అన్నట్టు ప్రభుత్వం ఆయన్ని టార్గెట్ చేసింది. అయితే నిమ్మగడ్డ మాత్రం తక్కువేం చేయలేదన్న అభిప్రాయాలున్నాయి. జగన్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ కేంద్రహోంశాఖకు ఘాటైన లేఖ రాశారు. ఇది ప్రభుత్వానికి మరింత కోపం తెప్పించింది. ఆ తర్వాత నిమ్మగడ్డపై ప్రభుత్వం తీసుకున్న చర్యలు, న్యాయస్థానాల్లో ప్రతికూల తీర్పుల గురించి అందరికీ తెలిసినవే.
ఈ ఏడాది మార్చి నెలాఖరుకు నిమ్మగడ్డ పదవీ విరమణ చేయనున్నారు. ఇంత జరిగిన తర్వాత, తన పదవీ కాలంలో ఎలాగైనా స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలనే పట్టుదల నిమ్మగడ్డలో పెరిగింది. ఎస్ఈసీగా నిమ్మగడ్డనే కాదు, ఆ స్థానంలో ఎవరున్నా ఇదే రకంగా వ్యవహరించేవారు. ప్రభుత్వం పగ పంచి నిమ్మగడ్డ నుంచి ప్రేమ కావాలంటే… ఎలా సాధ్యం? చివరికి నిమ్మగడ్డ పంతమే నెగ్గింది. ఎన్నికలను అడ్డుకోవాలనే ప్రభుత్వ ప్రయత్నాలు తాత్కాలికమే అని న్యాయస్థానాల తీర్పుతో తేటతెల్లమైంది.
గత ఏడాది మార్చిలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఏకగ్రీవాలు చేసుకున్నట్టే, ఇప్పుడు కూడా చేసుకోవచ్చని వైసీపీ గంపెడాశతో ఉండింది. ముందే చెప్పుకున్నట్టు …నాటికి, నేటికి ఎస్ఈసీ నిమ్మగడ్డ వ్యవహార శైలిలో నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా కనిపిస్తోంది. నాడు అధికార పార్టీ ఏం చేసినా చూసీచూడనట్టు వ్యవహరించారని వైసీపీ నాయకులే ఒప్పుకుంటున్నారు.
ప్రత్యర్థులను నామినేషన్ వేయకుండా అధికార పార్టీ నేతలు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. దాడులు, కిడ్నాపులు, బలవం తంగా నామినేషన్ల ఉపసంహరింప జేయడం, నామినేషన్ల పత్రాల చించివేత యథేచ్ఛగా సాగాయన్నది బహిరంగ రహస్యమే. చాలా చోట్ల నామినేషన్లు వేయడానికి వెళ్లిన అభ్యర్థులను పోలీసులే భయపెట్టి వెనక్కి పంపిన పరిస్థితి. మరి 11 నెలల్లోనే ఎంతలో ఎంత మార్పు.
తొలి దశలో 3,249 గ్రామ పంచాయతీలు, 32,504 వార్డు స్థానాలకు ఎన్నికలు ఈ నెల 9న జరగనున్నాయి. ఇప్పటి వరకూ 100 స్థానాలకు మించి ఏకగ్రీవాలు అయినట్టు ఎక్కడా కనిపించడం లేదు. నామినేషన్లు వేసే ధైర్యం అభ్యర్థులకు ఎక్కడి నుంచి వచ్చింది? అనే ప్రశ్నకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ తీసుకుంటున్న చర్యలే అని అధికార పార్టీ కూడా అంగీకరిస్తోంది.
అధికారి పార్టీని అడ్డుకునే క్రమంలో నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ కొన్ని సందర్భాల్లో అతి చేస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. కానీ ఎస్ఈసీ, జగన్ సర్కార్ మధ్య గొడవ కారణంగా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ కఠినంగా వ్యవహరించాల్సి వచ్చింది. దీంతో సామాన్యులకు ఒకింత ప్రయోజనమే.
11 నెలల క్రితం నామినేషన్ వేయడానికి వెళితే అడ్డుకున్న పోలీసులు, ఇప్పుడు అదే ఉద్యోగులు దగ్గరుండి నామినేషన్ వేయించే పరిస్థితి. ఎన్నికల వ్యవస్థ నిక్కచ్చిగా పనిచేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో ….పంచాయతీ ఎన్నికల్లో వెల్లువెత్తుతున్న నామినేషన్లే నిదర్శనం అని చెప్పొచ్చు. కానీ వైసీపీ పరంగా చూస్తే …ఎస్ఈసీతో గొడవ కారణంగా భారీగా ఏకగ్రీవాల అవకాశాన్ని కోల్పోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎస్ఈసీతో ఏ పేచీ లేకుండా ఉండి ఉంటే …అనామకుడిలా నిమ్మగడ్డ వచ్చే నెలలో రిటైర్డ్ అయ్యేవారు. వైసీపీ తాను అనుకున్నట్టు స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీగా లబ్ధి పొంది ఉండేది. కానీ అధికార మదంతో రెచ్చిపోయి కొరివితో వైసీపీ తల గోక్కుంది. ఇప్పుడు ఫలితాన్ని అనుభవిస్తోంది. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ అనే నానుడి వైసీపీ విషయంలో నూటికి నూరుపాళ్లు నిజం.