టీడీపీలో ప్రజాకర్షణ కలిగిన నేత లేకపోయినా, ఎన్నికలు వచ్చేసరికి ప్రధాన పోటీదారుగా నిలుస్తుంది. దీనికి కారణం పార్టీకి బలమైన పునాదులు వేయడమే. టీడీపీ ప్రధాన బలం రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలు, అందరినీ సమన్వయపరచుకోవడం, వ్యవస్థలను సద్వినియోగం చేసుకోవడం, అందుకు తగ్గ నిపుణులతో ఎప్పటికప్పుడు చర్చిస్తుండటం. ఒక్క రాజకీయ పార్టీకే కాదు…ఏ వ్యవస్థకైనా పౌండేషన్ బాగుంటేనే కొంతకాలం పాటు మనుగడ సాగిస్తుంది. టీడీపీ పునాదులు ఎంతో బలంగా ఉన్నాయి.
వైసీపీ విషయానికి వస్తే అంతా గాలివాటం. ఏదైనా ఆ పార్టీ అధినేత జగన్ మాత్రమే చేయాలి. మరి పార్టీకి బలమైన నెట్‌వర్క్ లేకపోతే 2019 ఎన్నికల్లో అధికారంలోకి ఎలా వస్తుందనే ప్రశ్న వేయవచ్చు. నిజానికి వైసీపీ శ్రేణుల కంటే, అదృశ్యంగా చంద్రబాబుకు వ్యతిరేకంగా పనిచేసిన శక్తులు, యుక్తులే ఎక్కువ. చంద్రబాబుపై వ్యతిరేకత మొత్తం ప్రత్యామ్నాయ నాయకుడైన జగన్‌కు కలిసొచ్చింది. టీడీపీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆ పార్టీలోని వివిధ నెట్‌వర్క్‌ల పనితీరు ఏంటో ‘సాక్షి’పై ప్రెస్‌కౌన్సిల్‌కు ఫిర్యాదే నిదర్శనం.
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి చెందిన సాక్షి దినపత్రిక, చానల్ టీడీపీ ప్రతిష్టను దిగజార్చేలా దురుద్దేశ పూర్వక కథనాల ప్రచురణ, ప్రసారం చేస్తున్నాయంటూ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాలకు మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఫిర్యాదు చేశాడు.
సాక్షి పత్రిక ఈ నెల 14న ‘మచ్చుకు రూ.2 వేల కోట్లు’, 15వ తేదీన ‘ఆంధ్రా అనకొండ’ పేరుతో నిరాధార కథనాలు ప్రచురించిందని, తప్పుడు కథనాలతో మీడియా విలువల్ని దిగుజారుస్తోందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. యనమల ఫిర్యాదుపై ఏమవుతుందనే చర్చ పక్కన పెడితే…టీడీపీ ఒక వ్యవస్థను ఎలా వాడుకుంటుందో చెప్పడానికి ఇదో నిదర్శనం.
మరి జగన్ సర్కార్‌పై గత కొన్ని నెలలుగా ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారంపై వైసీపీకి చెందిన ఏ ఒక్క నాయకుడైనా ఇలాంటి పనిచేశాడా? సచివాలయ ఉద్యోగాల్లో అక్రమాలు, అలాగే తాజాగా కియా పరిశ్రమ తరలిపోతున్నదంటూ ఎల్లో మీడియా చేసిన రాద్ధాంతం అందరికీ తెలిసిందే. ఈ దుష్ప్రచారంపై జగన్ సర్కార్ లేదా ప్రభుత్వ మీడియా సలహాదారులు, నాయకులు ఏం చేస్తున్నట్టు? అసత్య కథనాలు రాస్తే కేసులు పెడతామంటూ ఓ జీవో తీసుకురావడమే తప్ప, ఇంత వరకూ అలాంటి కేసు పెట్టిన దాఖలాలే లేవు. జీవో తీసుకొచ్చి అనవసరమైన రాద్ధాంతానికి అవకాశం ఇవ్వడం తప్ప. టీడీపీని చూసి వైసీపీ ఎప్పుడు నేర్చుకుంటుందో?