వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ సహా ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తూనే ఉన్నాయి. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి విమర్శలను తిప్పికొట్టినంత వేగంగా, సమర్థంగా ఎన్నికల తర్వాత వైసీపీ బ్యాచ్ పనిచేయలేదు. టీడీపీ, బీజేపీ, జనసేన నేతల్ని హడలెత్తించిన పెద్ద పెద్ద నోర్లన్నీ విశ్రాంతి తీసుకుంటున్నాయి. మళ్లీ ఇప్పుడు పవన్ కల్యాణ్ పుణ్యమా అని వైసీపీకి చురుకుపుట్టింది. 100రోజుల జగన్ పాలనపై పవన్ కల్యాణ్ రిపోర్ట్ చదివి వినిపించగానే ఎక్కడెక్కడి వైసీపీ ఎమ్మెల్యేలంతా జనసేనానిపై ధ్వజమెత్తారు.
ఎన్నికల తర్వాత పూర్తిగా సైలెంట్ గా ఉన్నవారంతా పెదవివిప్పారు. ప్యాకేజీ స్టార్ అంటూ చెడామడా తిట్టిపడేశారు. అఫ్ కోర్స్ పవన్ కల్యాణ్ రిపోర్ట్ కూడా అలానే ఉందనుకోండి. ఎవరో చెప్పిన పాఠాన్ని వల్లించిన పవన్ కల్యాణ్ ప్రభుత్వం చేసిన మంచిని ఏమాత్రం గుర్తించలేదు. లేని తప్పుల్ని జరిగినట్టు, 100రోజుల్లోనే రాష్ట్రం అతలాకుతలం అయిపోయినట్టు రభసచేశారు. అందుకే వైసీపీ టీమ్ పవన్ ని ఓ రౌండ్ వేసుకుంది.
వైసీపీ ఎమ్మెల్యేలంతా మూకుమ్మడిగా ఇచ్చిన ఈ కోటింగ్ వెనక అధిష్టానం ఆదేశాలున్నాయో లేదో తెలియదు కానీ ఊహించని విధంగా వైసీపీ నేతల నుంచి ప్రతిస్పందన వచ్చింది. ఇప్పటివరకూ ఒకరిద్దరు మంత్రులు, లేదా ఎమ్మెల్యే అంబటి, లేదా ట్విట్టర్ లో విజయసాయి రెడ్డి.. ఇలా విమర్శల కోసం వైసీపీ నుంచి లిమిటెడ్ స్వరాలే వినిపించేవి. పవన్ కల్యాణ్ విషయంలో మాత్రం అలా ప్రెస్ మీట్ అయిపోయిందో లేదో, ఇలా రియాక్షన్లు మొదలయ్యాయి.
చివరికి అత్యంత వివాదాస్పదమైన రాజధాని అంశంపై కూడా ఎమ్మెల్యేలంతా ఒక తాటిపైకి రాలేదు. కేవలం ఇద్దరు ముగ్గురు మంత్రులు మాత్రమే రాజధాని అంశంపై స్పందించారు. బొత్స వ్యాఖ్యల్ని వెనకేసుకొచ్చారు. కానీ జగన్ వందరోజుల పాలనపై విమర్శలు చేస్తుంటే మాత్రం వైసీపీ శ్రేణులు చూస్తూ ఊరుకోలేదు. వెంటనే ఎదురుదాడికి దిగాయి. ఈ విషయంలో మాత్రం వైసీపీ నేతలందర్నీ ఒక్కటి చేసిన ఘనత పవన్ కల్యాణ్ కే దక్కుతుంది.