ప్రతిపక్షంలో ఉండగా వైసీపీ సోషల్ మీడియా శక్తిమంతంగా పని చేసింది. తమ నాయకుడిని ముఖ్యమంత్రిగా చూసుకోవాలనే కలను నెరవేర్చుకునేందుకు వైసీపీ శ్రేణులు, చంద్రబాబు వ్యతిరేకులు కలిసి సోషల్ మీడియా వేదికగా చురుగ్గా పనిచేశారు. ఇదే క్రమంలో వైసీపీని అధికారంలోకి తెచ్చుకుంటే తమ బతుకులు కూడా బాగుపడతాయని వైసీపీ శ్రేణులు కలలు కన్నాయి. వైసీపీ శ్రేణుల రెండు కలల్లో ఒకటి నెరవేరింది. అది జగన్ సీఎం కావడం. ఇక రెండో విషయానికి వస్తే వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాదైనా తమకు ఒరిగేందేమీ లేదనే నిరాశనిస్పృహలకు ఆ పార్టీ శ్రేణులు లోనయ్యాయి.
ఎంతో కష్టపడి బాబును గద్దె దించి, తమ అభిమాన నాయకుడు జగన్ ప్రభుత్వంపై ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, ఆ పార్టీ సోషల్ మీడియా, ఎల్లో మీడియా, ఇతర పక్షాలు కలిసి మూకుమ్మడి దాడి చేస్తున్నా వైసీపీ సోషల్ మీడియా సైనికులు అనుకున్న స్థాయిలో స్పందించడం లేదు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ చేష్టలుడిగి నిస్సహాయంగా ఉండిపోవాల్సి వస్తోంది. దీనికి నిలువెత్తు నిదర్శనం శ్రీవారి ఆస్తుల విక్రయంపై జరుగుతున్న రచ్చే.
టీటీడీ నిరర్థక ఆస్తుల వేలానికి సంబంధించి గత టీడీపీ హయాంలోని పాలక మండలి తీసుకున్న నిర్ణయాల అమలుకు నేడు వైసీపీ హయాంలో బాధ్యతలు చేపట్టిన వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలోని పాలక మండలి ఆమోదం తెలిపింది. నిరర్థక ఆస్తుల గుర్తిం పును నాడు చదలవాడ కృష్ణమూర్తి అధ్యక్షతన సబ్ కమిటీని వేశారు. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం 30–1–2016న భూముల వేలానికి ఆమోదించారు. ఇది వాస్తవం.
కానీ టీటీడీ ఆస్తులను జగన్ పాలనలో అమ్మకానికి శ్రీకారం చుట్టారని, తద్వారా హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తు న్నారని ఏపీలోని ప్రతిపక్ష పార్టీలు గగ్గోలు పెడుతుంటే, వాటికి ఎల్లో మీడియా, ఆయా పార్టీల సోషల్ మీడియాలు మరింత విస్తృ తంగా విష ప్రచారం చేస్తున్నాయి.
టీటీడీ నిరర్థక ఆస్తుల అమ్మకాల విషయంలో ఈ రోజు రాద్ధాంతం చేస్తున్న ప్రతిపక్ష పార్టీల సభ్యులే నాడు తీర్మానం చేశారనే విషయాన్ని పాలక పార్టీ జనంలోకి తీసుకెళ్లడంలో పూర్తిగా విఫలమైంది. దీనికి కారణం గతంలో జగన్ అధికారంలోకి రావడానికి పని చేసిన వివిధ సోషల్ మీడియా విభాగాలు, నేడు మనకెందుకులే అని సహాయ నిరాకరణ చేయడమే. ఏడాదిగా జగన్ ప్రభు త్వం హామీల అమల్లో చురుగ్గా పనిచేస్తోందే తప్న, పార్టీ కార్యకలాపాలను పూర్తిగా విస్మరించారని చెప్పక తప్పదు.
ఏడాదిగా కనీసం మండలస్థాయిలో కూడా వైసీపీ సమావేశాలు నిర్వహించిన పాపాన పోలేదు. దీంతో తమ గోడును పట్టించుకోనప్పడు, తాము మాత్రం ప్రభుత్వానికి కష్టమొచ్చినప్పుడు ఎందుకు అండగా నిలబడాలనే ధోరణి పెరుగుతోంది. ఈ అసంతృప్తిని, అసహనాన్ని వైసీపీ పెద్దలు పట్టించుకోక పోతే మాత్రం భవిష్యత్‌లో తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది. దీనికి టీటీడీ నిరర్థక ఆస్తుల విషయమై ప్రతిపక్షాల వాదనను తిప్పకొట్టలేకపోతుండటాన్ని శాంపిల్‌గా తీసుకోవాలి.
-సొదుం
ఇప్పటికైనా జగన్ విజన్ ని ప్రతిపక్షాలు, పచ్చపాత మీడియా తెలుసుకుంటే మేలు