కడప జిల్లా పులివెందుల వైఎస్ కుటుంబానికి కంచుకోట. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందుల నుంచే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. పులివెందులలోని భాకరాపురంలో వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయం నుంచే వైసీపీ నేతలు ఆశ్చర్యకర హెచ్చరిక చేశారు.
ఈ నెల 6వ తేదీన ఆ నియోజకవర్గంలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్వహించ తలపెట్టిన ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకుని తీరుతామని అధికార వైసీపీ నేతలు హెచ్చరించారు.
ఈ హెచ్చరిక జనాల్ని ఆశ్చర్యపరుస్తోంది. ఎందుకంటే గతంలో వైఎస్సార్ హయాంలో ఈ ప్రాజెక్టును నెలకొల్పడం , అలాగే యురేనియం ప్రాజెక్టు వద్దని ఎవరెంతగా నెత్తీనోరూ కొట్టుకుని చెప్పినా వినిపించుకోలేదు. అలాంటిది ఇప్పుడు వైసీపీనే అడ్డు తగులుతామనడం కాసింత విచిత్రంగానే ఉంది.
వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మరకా శివకృష్ణారెడ్డి, వేముల మండల కన్వీనర్ నాగేళ్ల సాంబశివారెడ్డి, జెడ్పీటీసీ అభ్యర్థి కోగటం వెంకట బయపురెడ్డి తదితరులు మీడియాతో మాట్లాడుతూ ఈ హెచ్చరిక చేయడం గమనార్హం.
యూసీఐఎల్ (యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్) అధికారులు గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మరోసారి గని విస్తరణకు వీలుగా చేపట్టనున్న ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకుంటామని వారు తేల్చి చెప్పారు.
కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వేముల మండలం తుమ్మలపల్లి వద్ద యురేనియం కర్మాగారం గని విస్తరణ చేపట్టేందుకు 2021, జనవరి 6న రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రజాభిప్రాయ సేకరణకు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది.
యూసీఐఎల్ ప్రతి ఏడాది 9 లక్షల టన్నుల నుంచి 13.5 లక్షల టన్నుల ముడి యురేనియం వెలికితీతకు గని విస్తరణ చర్యలు చేపట్టింది. 2006-07లో ఇంటికో ఉద్యోగం, భూముల పరిహారం తదితర సమస్యలు పరిష్కరించకుండానే మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడాన్ని యురేనియం ప్రభావిత గ్రామాల ప్రజలు, అధికార పార్టీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
విలేకరుల సమావేశంలో వైసీపీ నేతలు మాట్లాడుతూ శనివారం యురేనియం అధికారుల ఎదుట ప్రజల తరపున 8 డిమాం డ్లను పెట్టామన్నారు. వారు సానుకూలంగా స్పందించినా, రాత మూలకంగా హామీ ఇవ్వడానికి నిరాకరించారన్నారు. 6న నిర్వహించనున్న ప్రజా భిప్రాయ సేకరణ విషయాన్ని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ఆయా గ్రామాల ప్రజల అభిప్రాయమే తమ అభిప్రాయమని ఎంపీ చెప్పారన్నారు.
నాల్గో రీచ్ పనుల ప్రారంభానికి ముందు బౌండరీ పరిధిలోని ప్రతి సెంటు భూమిని ప్రాజెక్టు కొనుగోలు చేసి …. భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారంతో పాటు ఉద్యోగ అవకాశం, పునరావాసం వెంటనే కల్పించాలని వారు డిమాండ్ చేశారు. గతంలో టైలింగ్ పాండ్ ఏర్పాటు ద్వారా భూమిని కోల్పోయిన రైతు కుటుంబాలకు వెంటనే నష్టపరిహారం, వారసులకు ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరారు.
యురేనియం ప్రాజెక్టు చుట్టుపక్కల గ్రామాల్లో ఎకరా భూమి ధర రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు పలుకు తోందన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు వల్ల భూగర్భ జలాలు కలుషితమై పంటలు రానందున …రైతు భూమి అమ్మకానికి పెడదామన్నా కొనుగోలు చేసేవాళ్లే కరువయ్యారని వైసీపీ నేతలు వాపోయారు.
కావున యురేనియం ప్రాజెక్టు పరిధిలోని అన్ని గ్రామాలను కొనుగోలు చేసి… ఎకరా రూ.20 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించి బాధితులకు పునరావాసంతో పాటు యువతకు ఉద్యోగ అవకాశాలు వెంటనే కల్పించాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ నేతలు ప్రజాభిప్రాయాన్ని అడ్డుకుంటామని హెచ్చరిస్తున్న నేపథ్యంలో మరో రెండు రోజుల్లో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకుంది.