టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కోరుకున్నదే వైసీపీ చేస్తోందా? అంటే ఔననే చెప్పొచ్చు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ రౌడీయిజానికి పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడాన్ని నిరసిస్తూ పరిషత్ ఎన్నికలను బహిష్కరించినట్టు చంద్రబాబు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే అధికార పార్టీ ఆగడాలను అడ్డుకోవాల్సింది పోయి పలాయనం చిత్తగించడం ఏంటంటూ సొంత పార్టీ నుంచే బాబుకు వ్యతిరేకత ఎదురైంది.
గత వ్యతిరేక అనుభవాలను దృష్టిలో పెట్టుకుని తాజాగా మిగిలిపోయిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టిగా పోరాటం చేయాలని టీడీపీ డిసైడ్ అయ్యింది. ఈ నేపథ్యంలో వైసీపీ అరాచకాలకు పాల్పడుతోందంటూ ఎస్ఈసీకి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు మీడియా ముందుకొచ్చి వైసీపీ నేతలకు, అధికారులకు హెచ్చరిక చేశారు. తాము అధికారం లోకి వస్తే వేటాడుతాం ఖబడ్దార్ అని హెచ్చరించారు.
చంద్రబాబు హెచ్చరికలు, ఫిర్యాదులను వైసీపీ లైట్ తీసుకుంది. తమకు బలం, అవకాశం ఉన్నచోట ఏకగ్రీవం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు ప్రత్యర్థుల నామినేషన్లను అడ్డుకుంటున్నట్టు ఆరోపణలొస్తున్నాయి. చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం మున్సిపాలిటీలో నామినేషన్ల చివరి రోజు ఉద్రిక్తత నెలకుంది. 14వ వార్డుకు చెందిన వెంకటేశ్ టీడీపీ తరపున నామినేషన్ వేసేందుకు వెళ్లగా గుర్తు తెలియని వ్యక్తులు పత్రాలు లాక్కొన్నట్టు ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు.
నామినేషన్ల పత్రాలను లాక్కునే క్రమంలో వెంకటేశ్‌పై దాడి చేయడంతో చేతికి గాయమైనట్టు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైసీపీ ఆగడాలను ఎస్ఈసీ ఏ మాత్రం అడ్డుకోలేకపోతోందని ప్రధాన ప్రతిపక్షం తీవ్రంగా తప్పు పడుతోంది.