తమ మనుషుల్ని కాపాడుకోవడానికి ఎల్లో మీడియా పడుతున్న కష్టం చూస్తే నిజంగా ఎవరికైనా జాలేస్తుంది. అడ్డంగా బుక్కయ్యారని తెలిసినా కూడా వాళ్ల పేర్లు బయటకు రాకుండా చేసేందుకు ఆ మీడియా పడే తాపత్రయం చూస్తుంటే ముచ్చటేస్తుంది.
ఇప్పటికే బాబు, లోకేష్ లాంటి ప్రముఖుల్ని ఓ సెక్షన్ మీడియా ఎలా వెనకేసుకొస్తుందో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మరో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును వెనకేసుకొచ్చేందుకు ఆ రెండు పత్రికలు, మరో 2 ఛానెళ్లు తెగ హైరానా పడుతున్నాయి.
ప్రత్యూష గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆస్తుల్ని ఇండియన్ బ్యాంక్ ఎటాచ్ చేసింది. ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్ ఫ్రా, ప్రత్యూష గ్లోబల్ ట్రేడ్, ప్రత్యూష ఎస్టేట్స్ లాంటి కంపెనీలన్నీ ఇందులో భాగం. వీటి ఆస్తుల్ని ఈనెల 25న వేలం వేయబోతున్నట్టు సదరు బ్యాంక్ తాజాగా ప్రకటించింది.
ఇదే విషయాన్ని బాబు అను''కుల'' మీడియా కవర్ చేసింది కూడా. కానీ ఈ అంశానికి సంబంధించి ఆ మీడియా దాచిన పేరు గంటా శ్రీనివాసరావు.
అవును.. ఒకప్పుడు గంటా శ్రీనివాసరావు డైరక్టర్ గా వ్యవహరించిన కంపెనీలు ఇవన్నీ. అతడి హయాంలోనే బ్యాంకు నుంచి ఏకంగా 141 కోట్ల 68 లక్షల రూపాయలు రుణం తీసుకున్నారు. తీసుకున్న రుణానికి తిరిగి చెల్లింపులు చేయకపోవడంతో 2017, డిసెంబర్ లోనే పలు ఆస్తుల్ని బ్యాంక్ స్వాధీనం చేసుకుంది.
ప్రస్తుతం వడ్డీతో కలిపి తీసుకున్న రుణం మొత్తం 248 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఇలా భారీగా రుణాలు ఎగవేసిన కేసులో డైరక్టర్ స్థాయిలో గంటా శ్రీనివాసరావు ప్రముఖంగా ఉన్నారు.
అయితే ఈ విషయాన్ని చెప్పడానికి ఎల్లో మీడియాకు మనసు రావడం లేదు. కొన్ని పత్రికలు, ఛానెళ్లు.. ''ప్రత్యూష గ్రూప్ ఆఫ్ కంపెనీస్ రుణాల ఎగవేత'' అంటూ వార్తను కవర్ చేసి చేతులు దులుపుకోగా.. మరికొన్ని ఛానెళ్లు, ఓ ప్రముఖ పత్రిక ఏకంగా ఈ వార్తను వదిలేశాయి.
వైసీపీ నేతలపై చిన్న పెట్టీ కేసు పడినా దాన్ని హెడ్ లైన్స్ లో చూపించడానికి ఎగబడే ఎల్లో మీడియాకు.. 248 కోట్ల రూపాయల కుంభకోణం మాత్రం కనిపించలేదు.
మొత్తానికి ప్రత్యూష గ్రూప్ ఆఫ్ కంపెనీస్ బండారం బయటపడింది. తను ఆ గ్రూప్ నుంచి ఎప్పుడో తప్పుకున్నానని, తనకు ఆ గ్రూప్ కు సంబంధం లేదని ఓవైపు గంటా చెప్పుకొస్తున్నప్పటికీ.. వేలంకు వస్తున్న ఆస్తుల్లో గంటాకు చెందిన స్థిరాస్తులు కూడా ఉన్నాయనేది బహిరంగ రహస్యం.
విశాఖలోని ఖరీదైన ప్రాంతాలతో పాటు.. రుషికొండ, మధురవాడ, గాజువాక, ఆనందపురం ప్రాంతాల్లో ఉన్న ఆస్తులు వేలానికి వస్తున్నాయి. వీటితో పాటు అనకాపల్లి, కాకినాడ, తమిళనాడులో ఈ గ్రూప్ కు ఉన్న ఆస్తుల్ని కూడా వేలం వేయబోతున్నారు.
ఈ మేరకు ఈ-టెండర్ నోటిఫికేషన్ జారీ అయింది. 23వ తేదీ వరకు టెండర్ కు టైమ్ ఇచ్చారు. 25వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్య ఈ-వేలం నిర్వహించి ఆస్తుల్ని అమ్మేస్తారు.