కాదేదీ ప్రైవేటుకు అనర్హం అన్నట్లుగా కేంద్రం తీరు ఉందని కార్మిల లోకం మండిపడుతోంది. ఇప్పటిదాకా విశాఖ స్టీల్ ప్లాంట్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడానికి దూకుడు చూపుతున్న కేంద్రం ఇపుడు రక్షణ రంగ పరిశ్రమల మీద కూడా తన కత్తిని దూస్తోంది అని అంటున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను ఏడు ముక్కలుగా చేసి కార్పోరేటీకరణ చేయాలని నిర్ణయించుకుందని విశాఖలోని నేవల్ డాక్ యార్డ్ కార్మిక నాయకులు ఆరోపిస్తున్నారు.
కేంద్రం చర్యలు దారుణం అంటూ వారు ఆందోళన బాట పట్టారు. ఈ వైఖరి నుంచి కేంద్రం దూరం జరగాలని కూడా వారు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. దేశంలోని ఆయుధ పరిశ్రమలను ప్రైవేటీకరణ చేయాలని తీసుకుంటున్న నిర్ణయం మంచి పరిణామం కాదని కార్మిక నాయకులు అంటున్నారు.
ఇది పూర్తిగా చెడు ఫలితాలను ఇస్తుందని కూడా ఎన్ సీ ఈ ప్రధాన కార్యదర్శి పీవీ రమణ హెచ్చరిస్తున్నారు. ఆయుధ కర్మాగారాలను ప్రైవేట్ పరం చేయడం అంటూ జరిగితే అది దేశ రక్షణకే పెను ముప్పుగా మారుతుందని కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి నిన్న స్టీల్ ప్లాంట్, నేడు నేవల్ డాక్ యార్డ్ ఇలా కార్మికులు తమ పని తాము చేసుకోకుండా ఆందోళన పధంలోకి అడుగులు వేయడానికి కేంద్రం ప్రైవేటీకరణ విధానాలే కారణమని అంటున్నారు.