కరోనా టైమ్ చాలామందికి బ్యాడ్ టైమ్. లాక్ డౌన్ కారణంగా న్యూస్ పేపర్ల సర్క్యులేషన్ దారుణంగా పడిపోగా.. సీరియళ్ల షూటింగ్ ఆగిపోయి ఎంటర్టైన్ మెంట్ ఛానెళ్ల రేటింగ్స్ పడిపోయాయి. ఇక థియేటర్ల మూతతో సినీ ఇండస్ట్రీ కూడా బాగా నష్టపోయింది. అయితే కొన్ని రంగాల వారికి మాత్రం లాక్ డౌన్ బాగా కలిసొచ్చింది. డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ కి ఒక్కసారిగా సబ్ స్క్రైబర్స్ పెరిగిపోయారు. ఊహించని రీతిలో నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లాంటి స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ రెవెన్యూ పెరుగుతోంది.
అటు యూట్యూబ్ ఛానెళ్లకు, వెబ్ సైట్ల వార్తలకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. అందులోనూ యూట్యూబ్ లో ప్రత్యేకంగా వంటల ఛానెళ్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. లాక్ డౌన్ సమయంలో ఖాళీగా ఇంట్లో కూర్చున్న చాలామంది యూట్యూబ్ లో వంటల పాఠాలు నేర్చుకుంటున్నారు. శ్రీవారికి కొత్త వెరైటీ చేసి పెట్టాలనుకున్న వారు, శ్రీమతికి తన చేతివంట రుచి చూపించాలనుకున్నవారు.. అందరూ యూట్యూబ్ కి ఏకలవ్య శిష్యులుగా మారిపోతున్నారు.
ఇంగ్లిష్, హిందీ, తెలుగు.. ఇలా అన్ని భాషల వంట వీడియోలకు మంచి డిమాండ్ వచ్చేసింది. ముఖ్యంగా తెలుగులో కుకరీ ఛానెళ్లు నడుపుతున్న వారంతా ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. సబ్ స్క్రైబర్స్ సంఖ్య భారీగా పెరిగిపోతోంది. డౌన్ లోడ్లు, వ్యూస్ ఎక్కువగా ఉండటంతో.. వారికి రెవెన్యూ కూడా బాగానే ముడుతోంది.
ఇటీవల యూట్యూబ్ ఛానెళ్లు పుట్టగొడుగుల్లా రావడంతో మానిటైజేషన్ నిబంధనలు కఠినతరం చేసింది యాజమాన్యం. అయితే కరోనా దెబ్బతో.. కాస్త అటు ఇటుగా ఇబ్బంది పడుతున్న యూట్యూబ్ ఛానెళ్లకు సబ్ స్క్రైబర్స్ పెరగడం, మానిటైజేషన్ రెవెన్యూ రావడం చకచకా జరిగిపోయాయి. ఇక అప్పటికే ఫేమస్ అయిన వంటల వీడియోలకు మరిన్ని క్లిక్స్ పడుతున్నాయి.
లాక్ డౌన్ ముందు వరకూ కొత్త రకాల మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ పరిచయం చేసే టెక్నాలజీ ఛానెళ్లకు మంచి డిమాండ్ ఉండేది. కరోనా వల్ల ఇప్పుడు స్థానాన్ని వంటల ఛానెళ్లు ఆక్రమించాయి.