గోదావరి ముంపు ప్రాంతాన్ని పరిశీలించడానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. ఆయన వెంట హోం మంత్రి సుచరిత, మరో మంత్రి పేర్ని నాని ఉన్నారు. అధికారులు జగన్ వెంట లేరు, అలాగే ఆ ప్రాంతానికి వెళ్లి అధికారులతో సమావేశం నిర్వహించలేదు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఇంతకీ అధికారులు ఏం చేస్తున్నారు? అంటే.. పునరావాస కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు!
ముఖ్యమంత్రి చేయాల్సిన పని జగన్ చేస్తుంటే, అధికారులు వారి పని చేస్తూ ఉన్నారు. అదే చంద్రబాబు హయాంలో ఇలాంటి విపత్తులు వచ్చిన సమయంలో ఉండే సీన్లు ఏమిటో వేరే గుర్తు చేయనక్కర్లేదు. చంద్రబాబు నాయుడు ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. ఆ తర్వాత విపత్తు చోటు చేసుకున్న చోటకు కొన్ని కిలోమీటర్ల ఆవల మకాం పెట్టే వారు. అక్కడకు అధికారులంతా హాజరు కావాల్సిందే! జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ముఖ్య అధికారులు ముఖ్యమంత్రి తో సమావేశాల్లో బిజీబిజీగా ఉంటారు. ఆయనకు సమాచారాలు ఇస్తూ ఉంటారు.
ఉన్నట్టుండి అధికారులపై చంద్రబాబు ఫైర్ అయినట్టుగా పచ్చమీడియా కథనాలను ఇస్తుంది. అధికారులు విఫలం అయ్యారని.. అన్నీ చంద్రబాబు నాయుడే దగ్గరుండి చూసుకుంటున్నారని ప్రత్యేక కథనాలు వండి వార్చేస్తారు. ముఖ్యమంత్రే అక్కడ ఉండి అంతా సమీక్షించి, ఎవరేం చేయాలో చెబుతున్నారని.. విపత్తును చంద్రబాబు నాయుడు ఒంటి చేత్తో డీల్ చేస్తున్నారని.. ఇలాంటి కథనాలు రెండు మూడు రోజులు! ఆ తర్వాత అక్కడ నుంచి చంద్రబాబు నాయుడు వెళ్లిపోతారు. అంతటితో విపత్తు నిర్వహణ అయిపోయినట్టు!
మరో ప్రెస్ మీట్ పెట్టి.. అధికారులందరినీ రాజధాని ప్రాంతానికి రప్పించి.. తుఫాన్ నో, వరదనో, మరో దాన్నో తాను విజయవంతంగా డీల్ చేసినట్టుగా, ఆ విపత్తును అధిగమించేసినట్టుగా ఒక గంటన్నర పాటు ప్రెస్ మీట్ పెట్టి చెప్పుకుంటారు. అంతటితో అయిపోయినట్టు అనమాట. హుదూద్ తుఫాన్ అయినా, తిత్లీ అయినా.. మరోటి అయినా చంద్రబాబు నాయుడి వ్యవహారం ఒకేలా ఉండేది. ఆ రోజులు అలా ఉండేవి!
అదే ప్రస్తుతానికి వస్తే.. అధికారులు పునరావాస కార్యక్రమాలను వదిలి రానక్కర్లేదని సీఎం వైఎస్ జగన్ ప్రత్యేకంగా పేర్కొన్నారని తెలుస్తోంది. ఇదీ తేడా!