తమ పార్టీ ఎంపీ బల్లి దుర్గా ప్రసాదరావు మరణంతో అనివార్యం అయిన తిరుపతి లోక్ సభ నియోజకవర్గం ఉప ఎన్నికపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టి సారించారు.
ఇందుకు సంబంధించి పార్టీ నేతలతో ఆయన సమావేశం జరిపారు. తిరుపతి లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు- నేతలు, చిత్తూరు- నెల్లూరు జిల్లాలకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ఏపీ మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సమావేశం అభ్యర్థి ఎవరనే అంశం గురించి చర్చ కూడా జరిగినట్టుగా ఉంది. ఈ విషయాన్ని పూర్తిగా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయానికే వదిలిపెట్టినట్టుగా ప్రకటించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు.
పార్టీని గెలిపించడమే తమ బాధ్యత అని, అభ్యర్థి ఎవరనేది అధినేత ఇష్టమని సమావేశంలో పాల్గొన్న నేతలు చెప్పుకొచ్చారు. 2019 ఎన్నికలకు మించిన మెజారిటీని తిరుపతిలో సాధిస్తామంటూ వారు విశ్వాసం వ్యక్తం చేశారు.
బల్లి దుర్గా ప్రసాదరావు కుటుంబీకులకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ ఉప ఎన్నికలో టికెట్ కేటాయించవచ్చు అనే ప్రచారం ఉంది. అయితే అధికారికంగా ఇంకా నిర్ణయం వెలువడలేదు.
ఇప్పటికే తిరుపతి బై పోల్ విషయంలో ప్రతిపక్ష పార్టీలు చాలా కసతర్తు చేశాయి. బీజేపీ ఈ ఉప ఎన్నికలపై చాలా కసరత్తు చేస్తోంది. టీడీపీ అయితే అభ్యర్థిని కూడా ప్రకటించేసింది. జనసేన కూడా హడావుడి చేస్తూ ఉంది. అయితే ఇంకా ఈ ఉప ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ కూడా ఏదీ రాలేదు.