నవరత్నాల కార్యక్రమాలన్నీ సజావుగా సాగుతున్న వేళ.. ఉగాది నాటికి పేదలకు ఇళ్ల పట్టాలు అందించే కార్యక్రమం కూడా అంతే విజయవంతమవుతుందనే నమ్మకంతో జగన్ సర్కారు ఉంది. అయితే పేదల ఇళ్ల స్థలాల విషయంలో కూడా నిస్సిగ్గుగా రాద్ధాంతం చేస్తోంది తెలుగుదేశం, దాని అనుకూల మీడియా. రెండు రోజులుగా వరుస కథనాలతో, ఈనాడు, ఆంధ్రజ్యోతి.. పేదల ఇళ్లపై విషం చిమ్మే ప్రక్రియ మొదలుపెట్టింది.
రాష్ట్రంలో దాదాపు అన్ని గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ స్వాధీనంలో ఉన్న భూముల సంఖ్య చాలా తక్కువ. వైఎస్ఆర్ హయాంలో విడతలవారీగా జరిగిన భూ పంపిణీలో పేదలందరికీ భూములు దక్కాయి. ఆ తర్వాత జనాభా పెరిగింది కానీ, తగ్గలేదు. గత ప్రభుత్వం పేదల్ని పూర్తిగా పట్టించుకోలేదు. అదే సమయంలో సీఎం జగన్ ఇప్పుడు పేదలకు భూపంపిణీకి శ్రీకారం చుడుతున్నారు, తండ్రిబాటలో నడిచేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ భూములు ఉన్నచోట్ల వాటిని వినియోగించుకుంటూ పూర్తిగా లేని చోట్ల ప్రైవేటు భూముల్ని కొనేందుకు ఆదేశాలిచ్చారు జగన్.
దీంతో కొన్నిచోట్ల ఆక్రమణలు తొలగించాల్సిన అవసరం ఏర్పడింది. అదే సమయంలో అర్హులైనవారుంటే అవే ఆక్రమణలను వారికే క్రమబద్ధీకరిస్తున్నారు కూడా. అయితే ఇక్కడే ప్రతిపక్షం అతితెలివిని ప్రదర్శించింది. కొన్ని ప్రాంతాల్లో పేదల ఇళ్లను స్వాధీనం చేసుకుంటున్నారంటూ వారిని రెచ్చగొడుతోంది. టీడీపీకి చెందినవారి స్థలాలను ప్రభుత్వం ఖాళీ చేయిస్తోందని కూడా దుష్ప్రచారం చేస్తోంది. కొన్నిచోట్ల అప్పటికప్పుడే ఆక్రమణలకు తెరతీసి ప్రభుత్వాన్ని, అధికారుల్ని ఇరుకున పెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు.
అదే ఊపులో టీడీపీ అనుకూల మీడియా తప్పుడు కథనాలు ప్రచురిస్తూ ప్రజల్ని రెచ్చగొడుతోంది. వాస్తవానికి ఏ ప్రభుత్వం అయినా లబ్ధిదారుల ఆకలి తీర్చడానికి మరొకరి పొట్టకొట్టాలని చూడదు. కొన్నిచోట్ల ఆక్రమణల తొలగింపు వాస్తవమే అయినా, ఆ భూములు స్వాధీనం చేసుకున్నంత మాత్రాన వారికి వచ్చే నష్టమేమీ లేదు. అదే సమయంలో లబ్ధిదారులకు సొంత స్థలం ఉందన్న భరోసా కూడా మిగులుతుంది.
గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వనట్టుగా భూములకు పట్టాలివ్వడానికి సిద్ధమైంది జగన్ సర్కారు. ఉగాదిన మొదలయ్యే ఈ మహా యజ్ఞంలో విషం చిమ్మడానికి చూస్తున్నారు టీడీపీ నేతలు. వీటన్నినిటినీ జగన్ ప్రభుత్వం ఎలా ఎదుర్కుంటుందో చూడాలి.