వైసీపీకి ఏపీలో ప్రజాదరణ ఎందుకో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఇవాళ వైసీపీ 12వ ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ సీనియర్ నేతలు కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు.
అనంతరం సజ్జల మాట్లాడుతూ కోట్లాది మంది ప్రజల ఆకాంక్షల దిశగా అడుగులు వేసిన పార్టీ వైసీపీ అని అభివర్ణించారు. ప్రజల ఆశలకు రూపం ఇచ్చిన ఘనత పార్టీ సభ్యులదన్నారు.
ఈ మూడేళ్ళలోనే.. మూడు దశబ్దాల అభ్యుదయం కన్పిస్తోందని చెప్పుకొచ్చారు. అధికారం కోసం కొట్లాడే రాజకీయం కాకుండా సేవ చేయడంలో పోటీ చూపిస్తోంది కాబట్టే ఇంత ప్రజాదరణ దక్కుతోందని ఆయన చెప్పడం విశేషం. మహానుభావుల కల ఏడు దశాబ్దాలు గడిచినా నెరవేరలేదని, కానీ వైసీపీ పాలనలో రెండేళ్లలోనే గట్టి పునాది వేసినట్టు సజ్జల చెప్పడం గమనార్హం.
మహామహులకు చేతకానిది, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో సాధ్యమైందన్నారు. రాజకీయంగా అన్ని వర్గాలకు సాధికారత తీసుకొచ్చామన్నారు. మహిళలకు నిజమైన సాధికారత దిశగా అడుగులు వేశామన్నారు. గర్భంలో ఉన్న శిశువు దగ్గరి నుంచే చేయి పట్టుకుని ప్రభుత్వం నడిపిస్తోందని సజ్జల చెప్పారు.
ప్రభుత్వ స్కూల్లో సీటు కోసం సిఫార్సులకు వస్తున్నారంటే వాస్తవ అభివృద్ది కనిపిస్తోందన్నారు. కుప్పంలో కూడా ఓడిపోయి.. నిన్న అండమాన్ గెలిచామని పండుగ చేసుకునే దుస్థితికి టీడీపీ నేతలు వచ్చారన్నారు.
వైసీపీకి ప్రత్యర్థులు ఎవరూ లేరన్నారు. ప్రజల్ని మోసం, దగా చేసే వారే ప్రజలకు ప్రత్యర్థులని చెప్పారు. మాయలు, చేతబడులు చేసే వారిని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.