మాజీ ముఖ్యమంత్రి , టీడీపీ అధినేత చంద్రబాబు బాటలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నడుస్తున్నారు. ముఖ్య మంత్రి పదవిలో ఉన్నంత వరకూ ప్రభుత్వ కార్యకలాపాల్లో తలమునకలై ఉండటం వల్ల చంద్రబాబు ఏనాడూ టీడీపీ నాయకులను, కార్యకర్తలను పట్టించుకోలేదు. దీంతో దాని ఫలితాలు ఎలా ఉంటాయో అధికారాన్ని కోల్పోయిన చంద్రబాబుకు బాగా తెలిసి వచ్చింది.
ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్ పరిస్థితి కూడా అంతే. 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ అధినేత జగన్ పూర్తిస్థాయి లో పాలనపై దృష్టి సారించారు. అయితే తనకు అధికారం రావడానికి కారణమైన పార్టీని ఆయన పట్టించుకునే పరిస్థితి లేదు. అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయింది. ఇంత వరకూ కనీసం ఎమ్మెల్యే, ఎంపీలకు కూడా ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో తమ సమస్యలను ముఖ్యమంత్రికి చెప్పుకునే దారి లేక అధికార పార్టీ ప్రజాప్రతినిధులు లోలోన కుమిలిపోతున్నారు.
ఏడాదిలోపే మ్యానిఫెస్టోలోని 90 శాతం హామీలు నెరవేర్చడం నిజంగా గొప్ప సంగతి. అందులోనూ కరోనా లాంటి పెద్ద విపత్తు లోనూ సంక్షేమ పథకాలను అమలు చేయడంలో జగన్ సర్కార్ ఏ మాత్రం వెనుకాడడం లేదు. ఇది అందరినీ ఆశ్చర్యపరు స్తోంది. సంక్షేమ పథకాల అమలు వరకు క్షేత్రస్థాయిలో సంతృప్తి వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో అధికార పార్టీ వైసీపీ శ్రేణుల్లో మాత్రం తీవ్ర నిరాశనిస్పృహలు అలుముకున్నాయి.
పార్టీ అధికారంలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసిన శ్రేణులకు…వచ్చిన తర్వాత తమను పట్టించుకునే దిక్కు లేదనే ఆవేదన మిగిలింది. ఒక్క కార్యకర్తల స్థాయిలోనే కాదు…ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ గోడు పట్టించుకునే వారు లేరని ఆవేదన వ్యక్తం చేస్తుండడం ప్రమాద ఘంటికలకు నిదర్శనం. ఇటీవల సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ అన్న మాటలను పరిశీలిద్దాం.
‘నా నియోజకవర్గం (వినుకొండ)లో ఎవరికైనా అవసరమైతే దోసెడు ఇసుక కూడా దొరకడం లేదు. కలెక్టర్‌కు చెప్పినా ఉపయోగం ఉండడం లేదు. అమరావతిలో ఇసుకతో బయల్దేరిన లారీ …వినుకొండ రాకుండానే మాయమవుతోంది’ – గుంటూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఇసుకపై జరిగిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు.
‘ఇసుక దోపిడీ గురించి మా ముఖ్యమంత్రి జగన్ గారికి తెలియదు. ఆయన మల్లెపువ్వులాంటి వారు. ఇసుక దొరకలేదని సీఎంకు తెలిస్తే మాత్రం వెంటనే చర్యలు తీసుకుంటారు. కానీ ఆయన దగ్గరికి చేరే మార్గం ఏదీ? ఆయన చుట్టూ ముళ్ల కంచె లాంటి కోటరీ ఉంది. దాని దాటుకుని వెళ్లడం అసాధ్యం’…రఘురామకృష్ణంరాజు, వైసీపీ నర్సాపురం ఎంపీ
‘ఎన్నికల నిబంధనావళి రాక ముందే 100 పడకల ఆస్పత్రి , డయాలసిస్ కేంద్రం, ట్రామా కేర్ సెంటర్లు, ఆస్పత్రులు నిర్మించాలి. గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలని కోరినా సమాధానం లేవు. ఈ విషయం ఎవరికి చెప్పాలో , ఏమని అడగాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం. ఆందోళన, ఆవేదనతో మాట్లాడుతున్నా’– వెంకటగిరి మున్సిపల్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి
వీరిలో టీడీపీ హయాంలో బ్రహ్మనాయుడు ఆర్థికంగా చాలా నష్టపోయారు. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన బ్రహ్మనా యుడికి మంచి నాయకుడిగా పేరు ఉంది. ఎన్ని ప్రలోభాలు పెట్టినా టీడీపీ పాలనలో అధికార పార్టీలోకి వెళ్లని నిబద్ధత బ్రహ్మనా యుడి సొంతం. ఇసుకపై ఆయన ఆవేదన తీసి పారేసేందుకు లేదు. అలాగే ఆనం రామనారాయణరెడ్డి ఆవేదన కూడా అర్థం చేసుకోదగ్గదే. ఎవరికి చెప్పాలో, ఏమని అడగాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నామని ఆనం అంటున్నారంటే…ఇక భయంతో బయటికి మాట్లాడలేని వాళ్ల సంఖ్య కూడా తక్కువేం కాదు.
పాలనను, పార్టీని సమన్వయపరచుకుంటూ వెళితేనే రానున్న కాలంలో ఆశించిన ఫలితాలు వస్తాయి. ఏదో ఇప్పుడు అధికారం లో ఉన్నాం కదా అని, పార్టీని నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఎలాంటి గతి పడుతుందో కళ్లెదుట నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన చంద్రబాబు ను చూసి ఎప్పటికప్పుడు గుణపాఠం నేర్చుకోవాలి.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదవులు దక్కించుకున్న వాళ్లు, పాలనలో చక్రం తిప్పుతున్న వాళ్లు తమ స్వప్రయోజనాలు తప్ప, కిందిస్థాయి వాళ్లను పట్టించుకోవడం లేదని బలమైన ఆరోపణలున్నాయి. కనీసం తాము ఫోన్లు చేస్తే రిసీవ్ చేసుకునే పరిస్థితి కూడా లేదని వైసీపీ శ్రేణులు తీవ్ర ఆవేదన చెందుతున్నాయి. కనీసం ఆ నాయకుల వ్యక్తిగత సిబ్బంది కూడా కాల్స్‌ను రిసీవ్ చేసుకోవడం లేదని కార్యకర్తులు, నాయకులు మండిపడుతున్నారు. తమ రోదన అరణ్యరోదనగా మిగలాల్సిందేనా అని ప్రశ్నిస్తున్నారు.
ముఖ్యమంత్రికి నేరుగా తమ గోడు వెళ్లబోసుకునే అవకాశం ఉంటే గుంటూరు జిల్లా పరిషత్ సమావేశంలో బ్రహ్మనాయుడు, వెంకటగిరి విలేకరుల సమావేశంలో ఆనం రామనారాయణరెడ్డి, అలాగే వివిధ మీడియా సంస్థల్లో రఘురామకృష్ణంరాజు మాట్లాడేవారు కాదు. అధికార పార్టీలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికైనా సీఎం జగన్ తీరిక చేసుకుని నెలలో కనీసం రెండు మూడు రోజులైనా సొంత పార్టీ ప్రజాప్రతినిధులను కలుసుకునేలా కార్యాచరణ రూపొందించుకోవాలి. అలా కాదంటే మొదటికే మోసం వస్తుంది. పార్టీని పట్టించుకునే విషయంలో వైసీపీ మేల్కొంటే భవిష్యత్ ఉజ్వలం…లేదంటే అంధకారమే అని హెచ్చరించక తప్పదు.
-సొదుం