ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్వహించే రాజకీయ పార్టీల సమావేశానికి తాము హాజరు కావడం లేదని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టత ఇచ్చింది. ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యే అంబటి రాంబాబూ స్పందిస్తూ నిమ్మగడ్డ తీరుపై విరుచుకుపడ్డారు.
ఒకవైపు స్థానిక ఎన్నికల వ్యవహారంపై కోర్టులో విచారణ జరుగుతూ ఉండగా.. నిమ్మగడ్డ ఏ రీతిన ఈ సమావేశాన్ని నిర్వహిస్తారు? అని అంబటి ప్రశ్నించారు. ఎన్నికల నిర్వహణ గురించి ప్రభుత్వ ఉద్దేశాన్ని అడగకుండా తనకు ఇష్టం వచ్చినట్టుగా నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారన ధ్వజమెత్తారు. ఎస్ఈసీ వ్యవహరిస్తున్న తీరు సరిగా లేకపోవడంతో ఆయన నిర్వహిస్తున్న సమావేశానికి తాము వెళ్లడం లేదని అంబటి తేల్చి చెప్పారు.
ఆగిన ఎన్నికలను నిర్వహించే విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని తీసుకోవాలని సుప్రీం కోర్టు తన తీర్పులో పేర్కొందని అంబటి గుర్తు చేశారు. చీఫ్ సెక్రటరీ, వైద్య ఆరోగ్య కార్యదర్శిల అభిప్రాయాలతో సంబంధం లేకుండా నిమ్మగడ్డ వ్యవహరిస్తున్న తీరును బట్టి ఆయనకు ఏవో వేరే ఉద్ధేశాలు ఉన్నాయని స్పష్టమవుతోందని అంబటి అభిప్రాయపడ్డారు.
చంద్రబాబు నాయుడు రాజకీయంలో భాగంగా నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారని అంబటి అన్నారు. ఒక్క ఓటు పందని పార్టీలనూ నిమ్మగడ ఈ సమావేశానికి పిలిచారని, ఒక్కో పార్టీకి పదినిమిషాల పాటు కేటాయిస్తున్నట్టుగా ప్రకటించారని అంబటి పేర్కొన్నారు.
రాష్ట్రంలో మూడు కరోనా కేసులు కూడా లేని సమయంలో నిమ్మగడ్డ ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే ఏకపక్షంగా ఎన్నికలను వాయిదా వేశారని, ఇప్పుడు రోజుకు మూడు వేల కేసులు వస్తున్న పరిస్థితి ఉందని, కరోనా సెకెండ్ వేవ్ ఉంటుందని వైద్య పరిశోధకులు చెబుతున్న తరుణంలో ఎన్నికలను నిర్వహించవచ్చా? అని అంబటి ప్రశ్నించారు.
మూడు కోట్ల మంది ప్రజల భద్రతను, ఎన్నికల విధుల్లో పాల్గొనే టీచర్లు, ఉద్యోగులు, పోలీసుల భద్రతకు నిమ్మగడ్డ బాధ్యత వహిస్తారా? అని కూడా అంబటి ప్రశ్నించారు. హైదరాబాద్ లో స్టార్ హోటళ్లలో చీకటి సమావేశాలను నిర్వహించే నిమ్మగడ్డ ఎన్నికలను డ్రామాలా మార్చారని అంబటి విరుచుకుపడ్డారు.