వివాదాస్పద సిక్కుల గురువు డేరా చీఫ్ రామ్ రహీమ్ కు హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లను చేసింది. ఇప్పటికే పలు కేసుల్లో దోషిగా నిర్దారణ అయ్యి, జైలు శిక్షను కూడా ఎదుర్కొంటున్న ఈ డేరా చీఫ్ ను ఇటీవలే బయటకు వదిలారు. ఇరవై సంవత్సరాల జైలు శిక్షను ఎదుర్కొంటున్న డేరా చీఫ్ కు ఇటీవలే 21 రోజుల పాటు బయటకు అవకాశం ఇచ్చింది హర్యానా ప్రభుత్వం. ఇదంతా ఎన్నికల జిమ్మిక్ అనే టాక్ కూడా ఉంది.
పంజాబ్ లో ఎన్నికల నేపథ్యంలో డేరా చీఫ్ ద్వారా అక్కడి ఈయన ఫాలోయర్లను రంజింపజేయడానికి ఆయనను ప్రభుత్వం బయటకు వదిలిందనే టాక్ వినిపిస్తోంది. ఎన్నికల వరకూ వస్తే రాజకీయ పార్టీలు ఏ ఒక్క అవకాశాన్నీ వదలవని ఈ ఉదంతాన్ని గమనించి అర్థం చేసుకోవాలి. ఆశ్రమంలో అసాంఘిక కార్యకలాపాలూ, అత్యాచారాలు చేసి.. దోషిగా తేలిన వ్యక్తిని కూడా ఎన్నికల అవసరార్థం బయటకు వదిలారంటే.. పాలిటిక్స్ ఇలా పతాక స్థాయిలో సాగుతున్నాయి.
కేవలం బయటకు వదలడమే కాదు.. డేరా చీఫ్ కు భారీ ఎత్తున భద్రతను కూడా కల్పించింది హర్యానా ప్రభుత్వం. ఆయనకు జడ్ ప్లస్ కేటగిరి సెక్యూరిటీని కల్పించింది. డేరా చీఫ్ ను జైలు నుంచి బయటకు వదలడంపై ఒక వ్యక్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఎన్నికల సమయంలో రాజకీయం కోసం ఆయనను బయటకు వదలారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
అయితే హర్యానా ప్రభుత్వం డేరా చీఫ్ తరఫున వాదిస్తోంది. ఆయన హార్డ్ కోర్ క్రిమినల్ కాదని హర్యానా ప్రభుత్వం కోర్టులో పేర్కొనడం గమనార్హం! ఆయన రెండు హత్య కేసుల్లో జైలు శిక్షను అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై ప్రభుత్వం స్పందిస్తూ.. ఆయన ఆ హత్యలను చేయలేదని కూడా చెప్పింది! ఆయన హత్యలను చేయించాడు తప్ప, తను చేయలేదు.. అంటూ హర్యానా ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించిన డీలెయిల్డ్ రిపోర్టులో పేర్కొనడం గమనార్హం!
అలా డేరా చీఫ్ ను వెనకేసుకు వస్తూ.. ఆయనను తాము జైలు నుంచి బయటకు వదలడం సబబే అని సమర్థించుకుంది హర్యానా లోని బీజేపీ ప్రభుత్వం. జైలు నుంచి బయటకు వచ్చిన ఆయనకు ఖలిస్తానీ తీవ్రవాదం నుంచి ప్రమాదం పొంచి ఉందని, అందుకే జడ్ ప్లస్ కేటగిరి భద్రతను కల్పించినట్టుగా కూడా కోర్టుకు వివరించింది! ఇదీ కథ.