క్యాష్‌ లెస్‌, లెస్‌ క్యాష్‌ – తికమక, మకతిక.!

'క్యాష్‌ లెస్‌ ఎకానమీ దిశగా కీలకమైన ముందడుగు.. అదే పెద్ద నోట్ల రద్దు. ఈ దెబ్బతో దేశంలోంచి తీవ్రవాదం పారిపోతుంది.. అవినీతి అంతమైపోతుంది.. నల్లధనం అడ్రస్‌ గల్లంతవుతుంది..' Advertisement ఇదీ పెద్ద నోట్ల రద్దుకి…

'క్యాష్‌ లెస్‌ ఎకానమీ దిశగా కీలకమైన ముందడుగు.. అదే పెద్ద నోట్ల రద్దు. ఈ దెబ్బతో దేశంలోంచి తీవ్రవాదం పారిపోతుంది.. అవినీతి అంతమైపోతుంది.. నల్లధనం అడ్రస్‌ గల్లంతవుతుంది..'

ఇదీ పెద్ద నోట్ల రద్దుకి సంబంధించి ప్రధాని నరేంద్రమోడీ మొదట్లో చెప్పిన మాట. 'క్యాష్‌ లెస్‌ అంటే దానర్థం లెస్‌ క్యాష్‌ అని మాత్రమే. జనవరి 1 తర్వాత దేశంలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటాయి. అన్ని ధరలూ తగ్గుతాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కూడా గణనీయంగా తగ్గిపోతాయి. పన్నులు తగ్గిపోతాయి..'  ఇదీ దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన విమర్శల నేపథ్యంలో పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు చెప్పిన మాట.

దేశవ్యాప్తంగా నగదు కొరత తీరిపోయిందనీ, అవసరమైన మేర నగదు అందుబాటులో వుందనీ, ఇప్పుడు కొత్తగా కేంద్రం కథలు చెబుతోంది. అసలు దేశంలో నల్లధనం ఎంత వుంది.? అన్నదానిపైన మాత్రం కేంద్రం వద్ద ఎలాంటి సమాచారం లేదట. ఇంకోపక్క తీవ్రవాదులేమో ఎంచక్కా కొత్త పెద్ద నోట్లను ప్రింట్‌ చేసేస్తున్నారు. పాత నోట్ల స్థానంలో కొత్త నోట్లతో కొత్తకొత్తగా అవినీతి రాజ్యమేలుతోంది. నల్లధనం సంగతి సరే సరి. అయినా, దేశంలో ఇంకా నగదు కొరత తీరడంలేదు.

బ్యాంకులేమో, నగదు లావాదేవీలపై జరీమానాలు విధించడం షురూ చేసేస్తున్నాయి. ఏటీఎంలలో నగదు విత్‌ డ్రా విషయంలోనూ ఇంతే. తాజా పరిస్థితుల్ని తీసుకుంటే, పలు ఏటీఎంలలో 2 వేల రూపాయలకు మించి నగదు రావడంలేదు. ఎందుకిలా.? అన్న ప్రశ్నకు సమాధానం దొరకని పరిస్థితి. ఓ పది వేల రూపాయలు ఏటీఎం నుంచి తీసుకోవాలంటే ఐదు సార్లు గీకాల్సిందే. అలా చేస్తే, ఉచిత ట్రాన్సాక్షన్స్‌ ముగిసిపోతాయి. ఆ తర్వాత వడ్డన తప్పదిక. చెక్‌ రూపంలో చెల్లింపులు చేసినా, ఛార్జీల వాత తప్పదంటూ కొన్ని బ్యాంకులు పలు లావాదేవీలకు సంబంధించి వినియోగదారులకు సమాచారం అందిస్తున్నాయి.

ఇదంతా చూస్తే, అసలు కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్‌కి అసలు దేశ ఆర్థిక వ్యవస్థపై అవగాహన వుందా.? అన్న అనుమానం కలగకమానదు. రిజర్వు బ్యాంకు తికమక.. బ్యాంకుల తికమక.. కేంద్ర ప్రభుత్వం తికమక.. ఈ తికమక తుగ్లక్‌ పాలనలో, సామాన్యుడి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైపోయింది. నల్లధనం బయటకు రాలేదు, పన్నులు తగ్గలేదు, ధరల సంగతీ అంతే. కానీ, సరికొత్త భారం షురూ అయ్యింది. ఇప్పుడు కరెన్సీ నోటు సామాన్యుడ్ని భయపెడ్తోంది. మోడీ గతంలో చెప్పిన అచ్చేదిన్‌ ఇదైతే కానే కాదు, సామాన్యుడికిది చచ్చేదిన్‌.!