ఓ వ్యక్తిపై ఇంకో వ్యక్తి అసహనం పెంచుకుంటూ పోతే, పుట్టేది విద్వేషమే. ఆ విద్వేషానికి భాష ప్రాతిపదిక కావొచ్చు, ప్రాంతం ప్రాతిపదిక కావొచ్చు, రాష్ట్రం, దేశం ప్రాతిపదికలు కావొచ్చు… ఇంకేదైనా కావొచ్చుగాక.! విద్వేషం అనే మాటల్లో 'చిన్న, పెద్ద' అన్న తేడాలుండవు. ఏదైనా విద్వేషమే. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. తెలంగాణ ఉద్యమం గట్టిగా జరుగుతున్న సమయంలో, రాజకీయ నాయకులు ఏం చేశారు.? తమ రాజకీయ మనుగడ కోసం విద్వేషాల్ని రగిల్చారు. తెలుగు ప్రజల మధ్య చిచ్చురేపారు. అసెంబ్లీ సాక్షిగా ప్రజా ప్రతినిథుల్ని చితక్కొడితే, యూనివర్సిటీల సాక్షిగా సాధారణ పౌరుల్ని పరుగులు పెట్టించారు. ఇదీ విద్వేషమే. కానీ, ఉద్యమం ముసుగులో జరిగింది. 'అది ప్రజాస్వామిక ఆకాంక్ష.. అణగదొక్కబడిన ఆకాంక్ష.. దాన్ని బయటపెట్టే క్రమంలో అసహనం మామూలే.. దాన్నిప్పుడు అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు..' అనే వాదనలున్నాసరే, 'విద్వేష పంచాయితీ'కి ముగింపు వుండదుగాక వుండదన్న సంకేతాల్ని రాజకీయ నాయకులు ఇంకా పంపుతూనే వున్నారు.
ఇప్పుడిదంతా ఎందుకంటే, అమెరికాలో విద్వేషం రాజుకుంది. మన తెలుగువాడైన కూచిబొట్ల శ్రీనివాస్ అక్కడి జాత్యహంకార దాడుల్లో దుర్మరణం పాలయ్యాడు. 'రండి బాబూ రండి.. అమెరికా అభివృద్ధిలో భాగమవ్వండి..' అంటూ ఒకప్పుడు, ఇదే అమెరికా ప్రపంచానికి పిలుపునిచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులు, మేధావులు, యువత అమెరికా వైపు పరుగులు పెట్టింది. ఇప్పుడు అవసరం తీరిపోయింది.. అమెరికా సూపర్ పవర్ కంట్రీగా తిరుగులేని శక్తిని పుంజుకుంది.. అందుకే, ఇప్పుడు అమెరికాకి ఇంకెవరూ అవసరం లేదు. 'అమెరికా అమెరికన్ల కోసమే..' అంటూ విద్వేషం రగిల్చాడు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. ఎన్నికల్లో ఇదే మాట ఆయన చెప్పాడుగానీ, మాటమీద నిలబడ్తాడా.? అని లైట్ తీసుకున్నారంతా. మాట మీద నిలబడ్డాడు, విద్వేషాన్ని రగిల్చాడు. ఫలితం, కూచిబొట్ల శ్రీనివాస్ హత్య. ఇదొక్కటే కాదు, అమెరికాలో అమెరికాయేతరులపై దాడులు పెరిగిపోయాయి. 'మా దేశానికి మీరెందుకొచ్చారు.? బాగుపడ్డది చాలు, వెళ్ళిపోండి..' అంటూ హుకూం జారీ చేస్తున్నారు. ఇప్పుడేం చేయాలి అమెరికాలో స్థిరపడ్డ అమెరికాయేతరులు.? ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. మన, భారతీయుల పరిస్థితీ అక్కడ ఇప్పుడు అగమ్యగోచరంగా తయారైంది. విద్వేషం ఇంత పని చేస్తుందని భారతీయులు కలలో కూడా ఊహించి వుండరు.
మరో ముఖ్యమైన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించకుండా వుండలేం. ఢిల్లీ యూనివర్సిటీ రామ్‌జా కళాశాలలో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్న విద్యార్థులు మేధావులుగా చెలామణీ అవుతున్నారక్కడ. విద్వేష ప్రచారంతోనే 'నాయకత్వ లక్షణం' తమలో వుందని చాటి చెప్పుకోవడం సోకాల్డ్ మేధావుల ఉద్దేశ్యం. హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అదే జరిగింది. ఢిల్లీ జేఎన్‌యూలోనూ అదే జరిగింది. ఇప్పుడు ఇదిగో, రామ్‌జా కళాశాలలోనూ అదే జరుగుతోంది. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన విద్యార్థి సంఘం కావొచ్చు, దాన్ని వ్యతిరేకిస్తోన్న మరో విద్యార్థి సంఘం కావొచ్చు.. తమ మధ్య ఆధిపత్య పోరు, విద్వేషపూరిత రచ్చలో భాగంగా దేశ ప్రయోజనాల్ని దెబ్బతీయడమెంతవరకు సబబు.? దేశద్రోహం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని తీసుకొచ్చి, ఉద్రిక్తతలకు దారితీసింది ఓ విద్యార్థి సంఘం. దాన్ని వ్యతిరేకించింది మరో సంఘం. ఈ క్రమంలో 'ఆజాదీ కాశ్మీర్', 'ఆజాదీ బస్తర్' నినాదాలు తెరపైకొచ్చాయి. కొట్లాటదాకా వెళ్ళింది వ్యవహారం. ఇదే తీరు యూనివర్సిటీల్లో కొనసాగితే, ఇప్పటిదాకా ఆత్మహత్యలే చూశాం, ఇకపై హత్యలు కూడా యూనివర్సిటీల్లో చూడాల్సి వస్తుందేమో.!
ఏం తేడా వుంది, అమెరికాకీ ఇండియాకీ. అక్కడా విద్వేషం కన్పిస్తోంది.. ఇక్కడా విద్వేషం కన్పిస్తోంది. అమెరికాలో అమెరికన్లకీ, అమెరికాయేతరులకీ మధ్య రచ్చ జరుగుతోంటే, దురదృష్టవశాత్తూ మన భారతదేశంలో భారతీయుల మధ్యనే విద్వేషపు విషబీజాలు నాటుకుంటున్నాయి. భిన్నత్వంలో ఏకత్వం.. అని గొప్పగా చెప్పుకుంటున్నాంగానీ.. దేశభక్తి వంటి విషయాల్లో ఐక్యంగా వుండాల్సింది పోయి, ఇక్కడ 'భిన్నత్వం' కోసం మేధావితనాన్ని ప్రదర్శిస్తున్నాం. 'ఆజాదీ' నినాదంతో దేశాన్ని భ్రష్టుపట్టిస్తున్నామన్న విషయాన్ని సోకాల్డ్ మేధావులు మర్చిపోతే ఎలా.?