వెనకటికి ఎవడో ఓ దొంగ చేసిన పని గురించి పెద్దలు చెప్పే కథ ఒకటుంది.
‘‘అడవిలోని ఓ దొంగ బాటసారులందరినీ దోచుకుంటూ ఉండేవాడు. మరణకాలం వచ్చిన తర్వాత.. ‘నాకు మంచి పేరు వచ్చేలా చేయరా’ అని తుది కోర్కె కొడుకుతో వెల్లడించి, చనిపోయాడు. తాను ఏం చేస్తే, దొంగవాడైన తన తండ్రి గురించి నలుగురూ మంచిగా అనుకుంటారో.. కొడుకు దొంగకు అర్థం కాలేదు. చివరికి.. బాటసారుల్ని దోచుకోవడంతో పాటు, చితక్కొట్టి పంపించసాగాడు. అప్పుడు బాటసారులంతా.. వీడికంటె.. వీడి తండ్రి చాలా మంచోడు అనుకోవడం ప్రారంభించారు.’’
.. ఆ కథలాగా ఉంది.. ఇప్పుడు మన రాష్ట్రంలో రాజకీయం. ప్రభుత్వంలో అంతా తానే అయి చక్రం తిప్పుతూ ఉండే చినబాబు… పప్పు అనే విమర్శలను అనేకం ఎదుర్కొంటూ ఉన్నాడు. విషయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడడం.. తద్వారా పరువు పోయేలా ప్రవర్తించడం నారా లోకేష్ విషయంలో ఎన్ని సందర్భాల్లో జరిగిందో లెక్కే లేదు. తాజాగా కూడా ఇండియానుంచి బయటకు వచ్చేశాం అంటూ మాటల ప్రహసనం అందరికీ తెలుసు. అందుకే బహుశా పార్టీ అంటే అభిమానం ఉండే పలువురు కూడా పప్పు అంటూ ఉంటారు.
అయితే చినబాబు చాలా తెలివైన వాడని ప్రపంచానికి నిరూపించాలని చంద్రబాబు అనుకున్నట్లున్నాడు. అయితే అలా నిరూపించడానికి… అక్కడ తెలివితేటల్ని పెంచాలిగానీ.. మిగిలిన వాళ్లందరూ అంతకంటె తెలివి తక్కువ వాళ్లే , విషయ పరిజ్ఞానం లేని వాళ్లే అని చాటాలనుకుంటే ఎలా? పైగా ఆ ప్రహసనానికి తానే శ్రీకారం దిద్దాలని కూడా అనుకున్నట్లున్నారు.
చంద్రబాబుకు మరీ చరిత్ర తెలియదని అనుకోలేం. నాయకుడిగా ఎదిగిన తర్వాత తెలుసుకునే చరిత్ర మాత్రమే కాదు, డిగ్రీ లెవల్లో కూడా ఆయన చరిత్ర చదువుకునే వచ్చారు. అలాంటి చంద్రబాబు.. ఈ దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడడానికి కారకుడైన పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించాక దీక్ష విరమించాడని అనడం , నాలెడ్జీ లేనందువల్ల అనలేం… కేవలం నిర్లక్ష్యంగా ప్రసంగించడం వల్ల మాత్రమే. అందుకే ఇప్పుడు రాష్ట్రపౌరులంతా.. ‘‘ఈ పెదబాబుకు ఏమైంది?’’ అనే సినిమాటిగ్గా అనుకుంటున్నారు.
అయినా సీఎం రమేష్ చేస్తున్న దీక్షను పొట్టి శ్రీరాములు త్యాగంతో పోల్చి.. తెలుగుదేశం పార్టీ అనేది త్యాగమూర్తుల పార్టీగా బిల్డప్ ఇచ్చే స్కెచ్ ప్రకారం సిద్ధం చేసుకుని స్క్రిప్టు ప్రిపేర్ అయి చంద్రబాబు కడపకు వెళ్లారు. సీఎం రమేష్ దీక్ష గురించి భజన చేయడం మినహా.. ఆ మోజులో చారిత్రక వాస్తవాలను ఆయన విస్మరించినట్లుంది. తనకు డబ్బా కొట్టే మీడియా ప్రపంచం పుష్కలంగా ఉన్నది గనుక… ఆయన చెలరేగిపోయారు. సాక్షాత్తూ ఆనాడు పొట్టి శ్రీరాములు సాధించిన పరిధిలోని రాష్ట్రానికి మాత్రమే ప్రస్తుతం ముఖ్యమంత్రిత్వం నెరపుతున్న నలభయ్యేళ్ల సుదీర్ఘ అనుభవం గల నాయకుడు.. ఆ త్యాగాన్ని వక్రీకరించి మాట్లాడడం.. ఆయన పట్ల అవమానం కదా.. అని పలువురు విస్తుపోతున్నారు. నాయకుల మాటలకు చాలా విలువ ఉంటుంది. వారి ప్రతి మాటను ప్రజలు చాలా శ్రద్ధగా గమనిస్తారు. ఆలకిస్తారు. అందుకే నాయకులు ప్రసంగపు ఉత్సాహంలో పొరబాటు దొర్లినా కూడా.. దాన్ని వెంటనే సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తుంటారు.
చంద్రబాబు అలాంటి ప్రయత్నం కూడా చేయకపోవడం వలన.. పొట్టి శ్రీరాములు త్యాగం గురించి చంద్రబాబుకు మాత్రమే తెలియదా? లేదా, ఆయన ప్రసంగ సమయంలో ఆయన చుట్టూతా పరివేష్టించిన నాయక ధీరులందరూ కూడా ఇంతే సమానమైన జ్ఞానసంపత్తితో అలరారుతున్నారా అని ప్రజలకు అనుమానం కలుగుతోంది.