ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ చేస్తున్న పాన్ ఇండియా సినిమా ‘దేవర’. సెప్టెంబర్ నెలాఖరులో విడుదల. అది కాదు విషయం. ఈ సినిమా ఎన్టీఆర్ కు మాత్రమే కాదు, ఫ్యాన్స్ కు కూడా చాలా ప్రతిష్టాత్మకం. టాలీవుడ్ లో భయంకరమైన పాన్ ఇండియా పోటీ నడుస్తోంది. ఇక్కడ ఆడితే సరిపోదు. బాలీవుడ్ లో ఆడాలి. అక్కడ నడిస్తే సరిపోదు, విదేశాల్లో కూడా నడవాలి. ఇలా చాలా లెక్కలు వున్నాయి. ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ సినిమాకు చాలా అంటే చాలా గ్యాప్ వచ్చేసింది. ఇలాంటి టైమ్ లో వస్తున్న దేవరకు కు రెండు సవాళ్లు.
ఒకటి ఫ్యాన్స్ అంచనాలు అందుకోవాలి. రెండు ప్రేక్షకుల అంచనాలు అందుకోవాలి. అన్నింటికి మించి సినిమాకు మంచి హైప్, దానికి తగిన ఓపెనింగ్ కావాలి. అది చాలా కీలకం. కానీ సినిమా ఇప్పటికి అయితే ఇంకా బజ్ అందుకోలేదు. ఫ్యాన్స్ వరకు ఓకె. పాన్ ఇండియా భారీ సినిమాలు అంటే కనీసం నెల రోజులు ప్రచారానికే కేటాయించాలి. సెప్టెంబర్ మొత్తం అందుకే సరిపోతుంది. అంటే సినిమాను అన్ని విధాలా ఆగస్టు చివరకు పూర్తి చేసేయాలి.
ఇప్పటి వరకు ఒక్క పాట మాత్రమే వదిలారు. మరో పాట ఈ నెలలో వస్తుందనే వార్తలు వున్నాయి. మొదటి పాట బాగానే వెళ్లింది. రెండో పాట ఎలా వుంటుందో చూడాలి. ఈ పాటల వల్ల సినిమా మీద ఓ అంచనా వస్తుంది. ఆ తరువాత ట్రయిలర్ లాంటి మిగతా కంటెంట్ ఎలాగూ వుంటుంది. వీటన్నింటితో పాటు ప్రచారం కూడా జరగాలి. ప్రచారం అంటే ఇప్పుడు కొత్త కొత్త ఐడియాలు, రకరకాల ప్లానింగ్ లు ఇలా చాలా కావాలి.
మరి దేవర విషయంలో ఈ ప్లానింగ్ జరుగుతోందో లేదో తెలియదు. ప్రస్తుతానికి తెలుస్తున్న వివరాల ప్రకారం దేవర సినిమాకు ఇంకో రెండు పాటలు షూట్ చేయాలి. పది రోజుల టాకీ షూట్ వుంది. అంటే ఇవన్నీ ఎలా చేసినా, జూలై ఆఖరుకు పూర్తయిపోయే అవకాశం వుంది. ఆగస్టు నుంచి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి, సినిమా ప్రచారం మీదకు వెళ్లిపోవాలి. ముఖ్యంగా నార్త్ బెల్ట్ మీద దృష్టి పెట్టాలి. సరైన ఓపెనింగ్ అక్కడ టార్గెట్ గా పెట్టుకోవాలి.
ఇలాంటి విషయాల్లో రాజమౌళి తరువాతే ఎవరైనా. దర్శకుడు కొరటాల శివ సహజంగానే ప్రచారానికి దూరంగా వుంటారు. ఎన్టీఆర్ కూడా ఎక్కువగా హడావుడి చేసేది కూడా వుండదు. ఇప్పుడు ఈ ఇద్దరూ తమ స్వభావాలను పక్కన పెట్టి రంగంలోకి దిగాలి. అదే ఫ్యాన్స్ కోరిక.