తన సినిమాల్లో హీరోల్ని బెస్ట్ లుక్స్ లో ప్రజెంట్ చేస్తుంటాడు రాజమౌళి. ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ లను తమ కెరీర్ బెస్ట్ లుక్స్ లో చూపించాడు. ఇక బాహుబలి సినిమాలో ప్రభాస్ లుక్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇప్పుడు మహేష్ వంతు.
మహేష్-రాజమౌళి సినిమా ప్రీ-ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. దీనికి సంబంధించి మహేష్ పై విదేశాల్లో ఫొటోషూట్ కూడా జరిగింది. అయితే మహేష్ లుక్ ఎలా ఉండబోతోందనే అంశంపై మాత్రం ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. ఎట్టకేలకు దీనిపై చిన్నపాటి క్లారిటీ వచ్చింది.
అనంత్ అంబానీ పెళ్లికి హాజరయ్యాడు మహేష్. భార్య నమ్రత, కూతురు సితారతో కలిసి పెళ్లి వేడుకకు హాజరైన మహేష్, మీడియాకు పోజులిచ్చాడు. అందులో లాంగ్ హెయిర్, గడ్డం, మీసాలతో కనిపిస్తున్నాడు. ఇప్పటివరకు మహేష్ ఎప్పుడూ కనిపించని మేకోవర్ ఇది.
బహుశా, రాజమౌళి సినిమాలో మహేష్ లుక్ ఇదే కావొచ్చు. సినిమా షూటింగ్ కు ఇంకా టైమ్ ఉంది కాబట్టి, ఈ లుక్ లో మరికొన్ని మార్పుచేర్పులు కూడా ఉండొచ్చు. రాజమౌళి సినిమాలో మహేష్ లాంగ్ హెయిర్ తో కనిపించబోతున్నాడనేది మాత్రం పక్కా. ఈ లుక్ చూసి థార్ సినిమాలో హీరోలా మహేష్ ఉన్నాడంటూ పొంగిపోతున్నారు అతడి ఫ్యాన్స్.
కేవలం లుక్ పరంగానే కాకుండా, ఫిట్ నెస్ పరంగా కూడా మహేష్ ఈసారి భిన్నంగా కనిపించబోతున్నాడు. సరిలేరు నీకెవ్వరు, గుంటూరుకారం సినిమాల్లో స్లిమ్ గా కనిపించిన మహేష్, రాజమౌళి సినిమా కోసం కాస్త కండలు పెంచుతున్నట్టు సమాచారం.