మీ సొంతూరి గోడు వింటారా బాబూ!

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సొంతజిల్లా అయిన చిత్తూరుకు మామిడి సాగులో ఎంతో పేరుంది. రాష్ట్రంలోన రెండో అతిపెద్ద మామిడికాయల మార్కెట్ చిత్తూరు జిల్లాలోనే ఉంటుంది. జిల్లాలో కొన్ని వేల ఎకరాల్లో మామిడి సాగు అవుతుంది. దానికి…

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సొంతజిల్లా అయిన చిత్తూరుకు మామిడి సాగులో ఎంతో పేరుంది. రాష్ట్రంలోన రెండో అతిపెద్ద మామిడికాయల మార్కెట్ చిత్తూరు జిల్లాలోనే ఉంటుంది. జిల్లాలో కొన్ని వేల ఎకరాల్లో మామిడి సాగు అవుతుంది. దానికి తగినట్లుగానే… మామిడి కాయల నుంచి పల్ప్ తయారు చేసే ఫ్యాక్టరీలు కూడా పుష్కలంగానే ఉన్నాయి. అయితే తాజాగా ఆ జిల్లాలోని మామిడి రైతు దుస్థితి ఎలా ఉన్నదంటే మామిడి పంటకు గిట్టుబాటు ధర లేదని రైతులు లారీల్లో పండ్లు తీసుకువచ్చి కలెక్టరు కార్యాలయం ఎదుట రోడ్డుపై కుమ్మరించి.. తమకు న్యాయం కావాలని విలపిస్తున్నారు.

ముఖ్యమంత్రి సొంతజిల్లాలోనే ఇలాంటి దుస్థితి తాండవిస్తుండడం విశేషం. మామూలుగా చిత్తూరుజిల్లా టమోటా సాగుకు కూడా ప్రసిద్ధి గాంచినదే. ప్రతి ఏటా టమోటా ధరల మార్కెట్ ఎగుడు దిగుడులకు లోనవుతుంటుందనే సంగతి కూడా అందరికీ తెలుసు. ధరలు పతనం అయినప్పుడు చాలామంది చిన్న సన్నకారు రైతులు దారుణంగా నష్టపోతుంటారు. ట్రాక్టర్లలో కలికిరి, మదనపల్లె టమోటా మార్కెట్ లకు తీసుకువచ్చే రైతులు వాటిని అక్కడే రోడ్లమీద పారబోసేసి… ఖాళీ ట్రాక్టర్లతో ఏడ్చుకుంటూ తిరిగి గ్రామాలకు వెళ్లడం అక్కడ సర్వసాధారణం. ఏటా ఏదో ఒక సీజన్ లో ఇలాంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది.

అయితే ఈసారి మామిడి రైతుకు కూడా ఇలాంటి ఇబ్బందే ఎదురవుతోంది. ఇప్పుడు మార్కెట్ లో పలుకుతున్న క్వింటాలు ధర కనీసం కాయలు కోయడానికి, రవాణాకు పెట్టే ఖర్చులకు కూడా రావడంలేదని రైతులు వాపోతున్నారు. మామిడి పల్ప్ తయారుచేసే ఫ్యాక్టరీలు అక్కడ ఎక్కువే ఉన్నాయి. ఆ ఫ్యాక్టరీల వారంతా సిండికేట్ గా ఏర్పడి.. రైతులకు అన్యాయం చేస్తున్నారనేది ఆరోపణ. కలెక్టరు ప్రకటించిన ధరను కూడా పల్ప్ ఫ్యాక్టరీ యజమానులు ఇవ్వడం లేదనేది వారి ఆవేదన.

నిజానికి ఈ పల్ప్ ఫ్యాక్టరీల యజమానుల్లో ప్రముఖ తెలుగుదేశం నాయకులు కూడా ఉండడం విశేషం. ముఖ్యమంత్రి స్పందించి కనీసం తన సొంతజిల్లా రైతుల కన్నీళ్లను తుడవడానికైనా.. ఫ్యాక్టరీల యజమానులతో చర్చలు జరిగేలా చూసి… వారికి న్యాయం చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. మరి చంద్రబాబునాయుడు వారి విలాపాలు వినిపిస్తాయో లేదో చూడాలి. ఇప్పటికే సీజను దాటిపోతోంది.. సకాలంలో ఆయన స్పందిస్తారో లేదా, కమిటీలంటూ కాలయాపన చేస్తారో కూడా చూడాలి.