అమర్ నాధ్ యాత్ర, మానస సరోవర యాత్ర చేసే భక్తుల్లో పలువురు ప్రయాణంలో ఉండగా మృతి చెందడం అనేది కొత్త సంగతి కాదు. ప్రతిఏటా ఎంతోకొంత మంది మరణిస్తూనే ఉంటారు. వారిమీద దాడులు కూడా జరుగుతూ ఉంటాయి. ఇదంతా ఒకఎత్తు అయితే.. ఈ ఏడాది మరణించిన వారి సంగతి అటుండగా.. కనీసం భక్తులు యాత్రను కొనసాగించే పరిస్థితి కూడా లేకపోవడం అనేది గమనించాలి. మనదేశానికి, ప్రత్యేకించి తెలుగురాష్ట్రాలకు చెందిన పలువురు భక్తులు ఈయాత్రలకు వెళ్లి.. వాతావరణ పరిస్థితులు అనుకూలించక, చేతిలో డబ్బులు అయిపోయి అక్కడే నానాపాట్లు పడుతూ ఉన్న వార్తలు విస్తుగొలుపుతున్నాయి.
మొత్తానికి వారి తిరుగుయాత్ర కూడా మొదలైంది. మానస సరోవరం, అమర్ నాధ్ లకు వెళ్లే యాత్రికులు మరణించడానికి అనేక కారణాలు ఉంటుంటాయి. మామూలు వాతావరణం ఉండే ప్రాంతాల్లో జీవించే వారు.. ఆ యాత్రలకు వెళ్లినప్పుడు తీవ్రమైన ప్రతికూల వాతావరణ స్థితిగతులను ఎదుర్కొంటూ ఉంటారు. దానికితోడు చాలామంది జీవితంలో ముసలితనం వచ్చేసిన తర్వాత.. పుణ్యం ఆర్జించుకోవడానికి అన్నట్లుగా వెళ్లే తీర్థయాత్రల్లో వీటికి కూడా వెళ్తుంటారు. వయస్సు పెరిగే కొద్దీ వచ్చే సాధారణమైన రుగ్మతలు కూడా.. కొందరి మరణాలకు దారి తీస్తుంటాయి.
తెలుగుప్రాంతాలనుంచి మరణించిన వారిలో గ్రంథి సుబ్బారావు శ్వాస అందక, లక్ష్మీనారాయణస్వామి, తోట రత్నంలు గుండెపోటుతోనూ మరణించిన సంగతి వార్తలు వచ్చాయి. మొత్తానికి వాతావరణం వల్ల యాత్ర కూడా నిలిచిపోయిది. భారత నేపాల్ ప్రభుత్వాలు సమన్వయం చేసుకుంటూ ఇబ్బందుల్లో ఉన్న భక్తులను వారి స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. భగవన్ముక్తి కోసం సాగించే యాత్రలో ఇలాంటి విషాదాలు, అవాంతరాలు ఏర్పడడం బాధాకరం అని భక్తులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఆదిశంకరుడు తన శివానంద లహరిలో ప్రపంచంలోని మనుషులు, వారి బాధలు సుఖాలు, అన్నీ శివుడు ఆడే ఆటే అని వర్ణిస్తాడు. ఈ ప్రపంచమే శివుడు తాను ఆడుకోవడానికి సృష్టించిన వేదిక అని, జనమంతా ఆయనకు ఆటబొమ్మలని స్తుతిస్తాడు. అదే శివుడి సేవకు వెళుతున్న భక్తులూ ఇలా మరణించడం కూడా శివుడి ఆటే అనుకోవాలేమో..!!