Advertisement

Advertisement


Home > Articles - Chanakya

బాబూ..ఎవరికి బడ్జెట్ గురించి తెలియదంటావ్?

బాబూ..ఎవరికి బడ్జెట్ గురించి తెలియదంటావ్?

తెలుగుదేశం నేతలు వైకాపాను వెంట్రుకలా తీసి పారేయడమ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎన్నికల సమయంలోనూ అనుభవం లేనివాడన్నారు జగన్ ను.  ఆ తరువాత ప్రతిపక్ష నేతగా అస్సలు పనికి రాని వాడన్నారు. ఇప్పుడు బడ్జెట్ అంటే అస్సలు ఓ న మ తెలియదంటున్నారు. ఇదేం పద్దతి? ప్రతిపక్షాన్ని ఈసడించడం తప్ప గౌరవించడం తెలియని చంద్రబాబు ముఖ్యమంత్రిగా శభాష్ అని ఎలా అనిపించుకుంటారు? నిజంగానే వైకాపాకు బడ్జెట్ అంటే తెలియదని అనుకుందాం. అమాయకంగా కొన్ని విమర్శలో, లేక అనుమానాలో లేవనెత్తింది అనుకుందాం. వాటికి సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై వుంది కదా? మర్డర్లు జరుగుతున్నాయంటే, మీ హయాంలో చేయలేదా? అని నిలేసి, సమాధానం చెప్పకుండా తప్పించుకున్నట్లే, బడ్జెట్ పై అనుమానాలకు కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

లక్షా పదకొండ వేల పై చిలుకు కోట్ల బడ్జెట్ లో 85వేల కోట్ల పైచిలుకు మొత్తం కేవలం ప్రణాళికేతర వ్యయానికే పోతుంటే, అది గొప్ప బడ్జెట్ అని ఎలా అనగలం? ఇదంతా ఖర్చు తప్ప మరేమీ కాదన్నది వాస్తవమేగా? మిగిలిన 26 వేల కోట్ల మొత్తాన్ని అలా అలా అన్ని శాఖలకు పంచుకుని వచ్చారు. పైగా 19వేల కోట్ల మేరకు ద్రవ్యలోటు, ఆరువేల కోట్ల మేరకు రెవెన్యూ లోటు చూపించారు. మరి ఈ ద్రవ్యలోటు పూడని పక్షంలో 26వేల కోట్లకు కోత కోయాల్సి వస్తుందా? రాదా? లేదూ పూడ్చడం కోసం ప్రభుత్వానికి అవకాశం వున్న ఎక్సయిజ్ లేదా రిజిస్ట్రేషన్ ఆదాయాలను పెంచుకునే ప్రయత్నం చేస్తారా చేయరా?అది అప్పడు ప్రజలపై భారంగా మారుతుందా మారదా? అయినా అసలు అన్ని రకాల ఆదాయాలు అంటే కేంద్ర పన్నులు, రాష్ట్ర పన్నులు, కేంద్ర గ్రాంటులు, ఇతరత్రా ఆదాయం అన్నీ కలుపుకున్నా 80 వేల కోట్లు దాటడం లేదు. 

అసలు అంత లోటు వున్నపుడు అంత భారీ బడ్జెట్ ప్రవేశ పెట్టడం ఎందుకు? ముందుగా కేటాయింపులు చేసి, ఏడాది చివర సవరణ బడ్జెట్ లో కోత కోయరు అని గ్యారంటీ ఇవ్వగలరా? కేవలం 65 కోట్లతో వృద్ధులకు, వికలాంగుల సంక్షేమం ఎలా సాధ్యం? వారికి అందించే ఫింఛన్లు ఈ పద్దులోకి వస్తాయా రావా? వస్తాయనకుంటే, అది సరిపడా మొత్తమేనా? 

అసలు ఇప్పటికీ ఆదాయం ఎంత వస్తుందో తెలియడం లేదని బడ్జెట్ సందర్భంగా చెప్పారు మరి ఏ ప్రాతిపదికన ఇంత భారీ బడ్జెట్ అంచనాలు తయారు చేసారు? పైగా ఇది జీరో బేస్డ్ బడ్జెట్..అంటే ఎప్పుడు ఎలా కావలిస్తే, అలా మార్చి ఖర్చు చేసుకోవచ్చు అని చెప్పారు. మరి అలాంటపుడు ఈ బడ్జెట్ కసరత్తు అంతా ఎందుకు? ఇంత ఆధాయం. ఇంత ఖర్చు..మిగిలింది ఇది.. దీన్ని అవసరాలకు అనుగుణంగా ఖర్చు చేస్తాం అని ఒక్క ముక్క చెబితే, మరి ఇంకెవరు ఏం మాట్లాడతారు? అయినా జీరో బేస్డ్ బడ్జెట్ అంటే ఇదీ అర్థం అని ఎవరు చెప్పారో?

ఇలా ఎంచుకుంటూ పోతే ఎన్ని అనుమానాలో? అంత మాత్రం చేత రాష్ట్ర ప్రభుత్వం చేసింది తప్పని అనలేం. ఎవరు పాలనలో వున్నా కాస్త మసి పూసి మారేడు కాయచేయాలనే చూస్తారు. అయితే అలా చేసినపుడు ప్రతిపక్షాలు ఎత్తి చూపడం కూడా మామూలే. అలాంటపుడు సంయమనంతో సమాధానం చెప్పాలి కానీ, మీకు బడ్జెట్ గురించే తెలియదు అని ఎద్దేవా చేయడం కాదు. సామాన్య మానవుడు అడుగుతాడు.అప్పుడు ఇలాగే అంటారా? బాబు తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసినపుడు ఏ అర్హత వుందని, ఏ అనుభవం వుందని జనం గెలిపించారు. ఇప్పుడు ఏం తెలుసు? ఏం అనుభవం వుందని లోకేష్ ను ముందుకు తోస్తున్నారు? 

సత్తా వుంటే సమాధానం చెప్పాలి కానీ గేలిచేయడం సరికాదేమో? తెలుగుదేశం నేతలు ఆలోచించాలి.

చాణక్య

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?